Aamir Khan: సల్మాన్‌కి అవకాశం ఇచ్చారు.. నేను కూడా రెడీ!

ABN , First Publish Date - 2022-07-25T23:46:01+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) హీరోగా మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (GodFather). ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్

Aamir Khan: సల్మాన్‌కి అవకాశం ఇచ్చారు.. నేను కూడా రెడీ!

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) హీరోగా మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (GodFather). ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ ‌మాదిరిగానే తనకూ ఓ అవకాశం ఇస్తే.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరున్న ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఆయన హీరోగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. ఆదివారం  హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. చిత్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్, చిత్ర సమర్పకులైన మెగాస్టార్ చిరంజీవి.. అలాగే చిత్రంలో కీలకపాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్య ఈ సమావేశంలో పాల్గొని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.


ఈ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఇంతకు ముందు తెలుగు డబ్బింగ్ సినిమాలకు తక్కువ మార్కెట్ ఉండేది. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. బాలీవుడ్‌లో కూడా మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటున్నాయి. అందుకే  తెలుగులో మా సినిమాను విడుదల చేయడానికి చిరంజీవిగారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవిగారిని ఒకటి కోరుతున్నాను. ప్రస్తుతం చిరంజీవిగారి చిత్రంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. ఆయన అవకాశం ఇస్తే.. సల్మాన్‌ ఖాన్‌లా నేనూ తనతో నటించడానికి సిద్ధంగా ఉన్నాను..’’ అని తెలిపారు. కాగా, వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్ బ్యానర్లపై.. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది.

Updated Date - 2022-07-25T23:46:01+05:30 IST