Aamir Khan: సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నటుడు

ABN , First Publish Date - 2022-11-16T23:13:26+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఇండియాలో మొదటిసారిగా రూ.100కోట్లు, రూ.200కోట్లు, రూ.300కోట్ల క్లబ్‌ను ప్రారంభించింది ఆమిరే.

Aamir Khan: సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నటుడు

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఇండియాలో మొదటిసారిగా రూ.100కోట్లు, రూ.200కోట్లు, రూ.300కోట్ల క్లబ్‌ను ప్రారంభించింది ఆమిరే. తన నటనతో 35ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘గజినీ’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ వంటి చిత్రాలతో మెస్మరైజ్ చేశాడు. చివరగా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) లో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. అయితే, ఆమిర్ తాజాగా అభిమానులకు షాకిచ్చాడు. సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు తెలిపాడు. 


ఆమిర్ ఖాన్ తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను సినిమాల్లో నటిస్తున్నప్పుడు నా జీవితంలో చాలా నష్టం జరుగుతుంది. ‘లాల్ సింగ్ చడ్డా’ అనంతరం నేను ఛాంపియన్స్‌లో నటించాలి. ఇది అద్భుతమైన కథ. స్క్రిఫ్ట్‌ కూడా బాగా వచ్చింది. నేను ఇందులో నటించాలి. కానీ, నేను సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. అమ్మ, పిల్లలు, నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నాను. నేను 35ఏళ్లుగా నటిస్తున్నాను. పనిపైనే పూర్తిగా దృష్టి సారించాను. అందువల్ల నా దగ్గరివారితో సమయాన్ని గడపలేకపోయాను. ప్రస్తుతం వారితో సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నాను. జీవితాన్ని కొత్తగా గడపాలనుకుంటున్నాను. ఒక్క ఏడాది లేదా ఏడాదిన్నర పాటు సినిమాలు చేయను’’ అని ఆమిర్ ఖాన్ చెప్పాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఆమిర్ ఖాన్ మూడు, నాలుగేళ్లకు ఓ సినిమా చేసేవాడు. తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’ లో నటించాడు. ఈ చిత్రం హాలీవుడ్ క్లాసికల్ హిట్ ‘ఫారెస్ట్ గంప్’ (Foreest Gump) కు రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమాలో కరీనా కపూర్, నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో ఆమిర్ ఖాన్ రెమ్యూనరేషన్‌ను తిరిగి ఇచ్చేశాడు.

Updated Date - 2022-11-16T23:13:26+05:30 IST