RRRforOscars: అవార్డ్స్ కోసం RRR టీమ్ క్యాంపెయిన్ చేస్తోన్న కేటగిరీలు ఇవే!

ABN , First Publish Date - 2022-10-06T16:30:07+05:30 IST

టాలీవుడ్ దర్శకుడు, దర్శకధీర ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్(RRR)’ మూవీ సృష్టించిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ పాన్..

RRRforOscars: అవార్డ్స్ కోసం RRR టీమ్ క్యాంపెయిన్ చేస్తోన్న కేటగిరీలు ఇవే!

టాలీవుడ్ దర్శకుడు, దర్శకధీర ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్(RRR)’ మూవీ సృష్టించిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలై దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లని సాధించింది. అనంతరం ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి వ్యూస్ సాధించింది. అంతేకాకుండా.. ఈ సినిమాని చూసిన పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. దాంతో.. ఈ మూవీ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్స్ 2023కి భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ జ్యూరీ ఈ సినిమాకి బదులు గుజరాతీ చిత్రం ‘ది చెల్లో షో’ని ఎంపిక చేశారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు నిరాశకు లోనయ్యారు. అయితే ఈ విషయంలో నిరాశకు లోనైన వారందరికీ ఇప్పుడో గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఆస్కార్ FYC (For Your Consideration) కింద పరిగణనలోకి తీసుకునేలా.. 15 కేటగిరీలలో RRR టీమ్ ఈ అవార్డుల కోసం క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. 


ఆస్కార్ అవార్డ్స్ కోసం RRR టీమ్ క్యాంపెయిన్ చేస్తోన్న కేటగిరీలు ఇవే..

1. బెస్ట్ మోషన్ పిక్చర్ (డి.వి.వి. దానయ్య), 

2. బెస్ట్ డైరెక్టర్ (ఎస్.ఎస్. రాజమౌళి), 

3. బెస్ట్ యాక్టర్ (NT రామారావు(jr), రామ్ చరణ్), 

4. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (అజయ్ దేవగన్), 

5. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), 

6. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (ఎమ్.ఎమ్. కీరవాణి), 

7. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్), 

8. బెస్ట్ సౌండ్ (రఘునాధ్ కేమిశెట్టి, బోలోయ్ కుమార్ బోలోయ్, రాహుల్ కర్పే), 

9. బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లే (వి. విజయేంద్రప్రసాద్ (కథ), స్ర్కీన్‌ప్లే (ఎస్.ఎస్. రాజమౌళి), అడిషనల్ డైలాగ్ (సాయిమాధవ్ బుర్రా) ), 

10. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రిసెస్ (ఆలియా భట్), 

11. బెస్ట్ సినిమాటోగ్రఫీ (కె.కె. సెంథిల్ కుమార్ ఐఎస్‌సి), 

12. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్), 

13. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ (రమా రాజమౌళి), 

14. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ (నల్ల శ్రీను, సేనాపతి నాయుడు), 

15. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (వి. శ్రీనివాస్ మోహన్-విఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్)


ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని లాస్‌ ఏంజెల్స్‌లో జరుగుతున్న బీయాండ్‌ ఫెస్ట్‌లో (Beyond Fest) టీసీఎల్‌ ఛైనీస్‌ థియేటర్‌ (ఐమాక్స్‌)లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. అక్కడి ప్రేక్షకులతో కలిసి ఐమాక్స్‌ స్ర్కీన్‌పై తన చిత్రాన్ని చూసి మురిసిపోయారు జక్కన్న. థియేటర్‌లో సినిమాను వీక్షిస్తున్న ఫారిన్‌ ఆడియన్స్‌ ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్‌తో ఆడిటోరియంను హోరెత్తించారు. ఆ వీడియోను లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి వేదికపై వెళ్లగా కరతాళ ధ్వనులతో ప్రేక్షకులు స్టాండింగ్‌ ఓవెషన్‌ ఇచ్చారు. మరి ఇంతటి ఆదరణని చూరగొంటున్న ‘ఆర్ఆర్ఆర్’ని ఆస్కార్ టీమ్ FYC (For Your Consideration) కింద ఏయే విభాగాల్లో సెలక్ట్ చేస్తుందో.. వేచి చూడాలి.



Updated Date - 2022-10-06T16:30:07+05:30 IST