Akhil Akkineni: 'జైనబ్‌ నా బంగారు తల్లి.. నాన్నే నా ధైర్యం

ABN , Publish Date - Jul 16 , 2026 | 01:38 PM

'లెనిన్‌' (lenin)సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తున్నారు అఖిల్ అక్కినేని. బుధవారం గుంటూరులో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం, కుటుంబం, అభిమానుల గురించి భావోద్వేగంగా మాట్లాడారు.

'లెనిన్‌' (lenin)సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తున్నారు అఖిల్ అక్కినేని. బుధవారం గుంటూరులో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం, కుటుంబం, అభిమానుల గురించి భావోద్వేగంగా మాట్లాడారు. తన భార్య జైనబ్‌, తండ్రి నాగార్జున తనకు అండగా నిలిచిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అఖిల్‌ మాట్లాడుతూ 'ఇంట్లో జైనబ్‌ను ప్రేమగా 'బంగారు తల్లి' అని పిలుస్తాను. గత మూడేళ్లుగా నేను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో ఆమె ప్రతి క్షణం నా వెంటే నిలబడి నాకు ధైర్యం చెప్పింది. భార్యగానే కాదు.. ఒక మంచి స్నేహితురాలు, మార్గదర్శకురాలిగా నాకు అండగా నిలిచింది. ఆమె ఇచ్చిన మద్దతును జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను' అని అన్నారు తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ అఖిల్‌ భావోద్వేగానికి లోనయ్యారు. 'లెనిన్‌' విడుదల తర్వాత జరిగిన కార్యక్రమంలో నాన్నను హత్తుకున్నప్పుడు.. ఎన్నో ఏళ్లుగా నా మనసులో దాచుకున్న భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. నా కెరీర్‌లో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నాన్న ఒక్కసారి కూడా నన్ను నిరుత్సాహపరచలేదు. తిట్టలేదు. నన్ను నమ్ముతూ ముందుకు నడిపించారు. తండ్రిగానే కాదు.. మంచి స్నేహితుడిలా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలిచారు. 'లెనిన్‌' విజయానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది'.

అలాగే ఇలాంటి అభిమానులను సంపాదించుకోవడం నిజంగా అదృష్టం. వారి ప్రేమ, నమ్మకమే నాకు పెద్ద బలం. ఫ్యాన్స్‌ కోసం అయినా ఒక మంచి విజయం సాధించాలని ఎప్పుడూ అనుకునేవాడిని. ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. విజయం వచ్చిందని గర్వపడను.. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇక నుంచి మరింత బాధ్యతతో మంచి సినిమాలు చేస్తూ నా కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తాను' అని అఖిల్‌ పేర్కొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 02:03 PM