నిర్మాతగా మారిన బన్నీ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు!
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:33 PM
గీతా ఆర్ట్స్ శిబిరం నుండి మరో యంగ్ ప్రొడ్యూసర్ రాబోతున్నాడు. అల్లు అర్జున్ మేనేజర్‌గా పనిచేసిన శరత్ చంద్ర నాయుడు 'గుర్తుకొస్తున్నాయి' పేరుతో ఓ ఫీచర్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు.
కొందరు సీనియర్ దర్శకులు తమ శిష్యులను దర్శకులను చేస్తుంటారు. దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ శిష్యులు ఎంతో మంది దర్శకులుగా మారారు. ఇక ఇప్పుడైతే, రాజమౌళి, సుకుమార్ శిష్యులు అనేకమంది దర్శకులుగా రాణిస్తున్నారు. అలానే గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాతలను తయారు చేసేదిగా మారిపోయింది. అల్లు అరవింద్ కనుసన్నలలో పనిచేసిన ఓ తరం ఇప్పుడు చిత్ర నిర్మాణంలో యాక్టివ్‌గా పాల్గొంటోంది. అలానే వెబ్ డిజైనింగ్ నుంచి, జర్నలిజంలోకి వచ్చి... ఆపైన అల్లు అర్జున్‌కు కొంతకాలం మేనేజర్‌గా వ్యవహరించిన శరత్ చంద్ర నాయుడు కూడా ఇప్పుడు నిర్మాతగా మారారు. కొన్నేళ్ళ క్రితం అల్లు అర్జున్‌కు సన్నిహితంగా ఉన్న జర్నలిస్ట్ ఎస్.కె.ఎన్. కూడా 'బేబీ' సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిన విషయం తెలిసిందే.
కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజీ నుండి 2009లో బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ పట్టా తీసుకున్న అడ్ల శరత్ చంద్ర నాయుడు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి వెబ్ సైట్ డెవలప్‌మెంట్ కోర్స్ చేశారు. ఆ తర్వాత సొంతంగా పలు వెబ్ సైట్స్ ను నిర్వహించారు. ముఖ్యంగా ఆయన కెరీర్ ప్రారంభంలో పెట్టిన 'మైత్రీవనం' వెబ్ సైట్ ఎంతోమంది నిరుద్యోగులకు మార్గదర్శిగా ఉండేది. ఆ తర్వాత శరత్ చంద్ర కొన్ని మీడియా సంస్థలలో వివిధ హోదాలలో పనిచేశారు. సినిమా మీద మక్కువతో ఆపైన గీతా ఆర్ట్స్ గూటికి చేరిన శరత్ చంద్ర సినిమా నిర్మాణంలోని సాధకబాధకాలను అవగతం చేసుకున్నారు. బేసికల్‌గా క్రియేటివ్ థాట్స్ ఉన్న శరత్ చంద్ర ఆ అనుభవంతో ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈటీవీ విన్ సహకారంతో ఆయన 'గుర్తుకొస్తున్నాయి' అనే సినిమాను నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా అది త్వరలో విడుదల కానుంది.
విరాజ్ అశ్విన్, యశశ్రీరావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ కీలక పాత్రలు పోషించిన 'గుర్తుకొస్తున్నాయి' సినిమాను వినోద్ గాలి డైరెక్ట్ చేశారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో బన్నీ నటించిన 'ఆర్య, 'దేశముదురు' రిఫరెన్సెస్ ఉండటం విశేషం. గతాన్ని మర్చిపోయిన ఓ యువకుడి జీవితంలో ఏం జరిగిందనే అంశం ఆధారంగా 'గుర్తుకొస్తున్నాయ్' మూవీ తెరకెక్కుతోంది. నిజానికి హీరోల మేనేజర్స్ నిర్మాతలు కావడం తెలుగు సినిమా రంగంలో కొత్తమే కాదు. హీరోలు, హీరోయిన్ల డేట్స్‌ను చూసే వారు కూడా నిర్మాతలుగా మారారు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయారు. మరి ఎస్.కె.ఎన్. లానే శరత్ చంద్ర కూడా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అవుతారేమో చూడాలి.