మార్క్ కె రాబిన్: గద్దర్ పాటలు వింటూ.. ఆయన అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది
ABN , Publish Date - Mar 10 , 2026 | 07:10 PM
'చిన్నప్పటి నుంచి గద్దర్ పాటలు అంటే ఇష్టం. అవి పాటలు కాదు ఫైర్'. ఆయన పాటలు వింటూ పెరిగి ఆయన పేరుతో ఉన్న అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది.
'చిన్నప్పటి నుంచి గద్దర్ పాటలు అంటే ఇష్టం. అవి పాటలు కాదు ఫైర్'. ఆయన పాటలు వింటూ పెరిగి ఆయన పేరుతో ఉన్న అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. ప్రతిభను గుర్తింపు లాంటి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి, జ్యూరీ మెంబర్లకు ధన్యవాదాలు' అని యువ సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ అన్నారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో ‘దండోరా’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా అతన్ని అవార్డు వరించింది. చక్కని కథలో భాగం చేసిన దర్శకుడు మురళీ కాంత్, నిర్మాత రవీంద్ర బెనర్జీ కి మార్క్ కె రాబిన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మార్క్ గురించి ఆసక్తికర విశేషాలు..
‘అ!’ సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టారు మార్క్ కె రాబిన్. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న తేడాను చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ తనకు నచ్చిన, మెచ్చిన కథలకు సంగీతంతో జీవం పోస్తూ తనదైన మార్క్ చూపించారు. ఇప్పటి వరకు మార్క్ కె రాబిన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయన ప్రతిభకి తగ్గ పురస్కారాన్ని ప్రకటించింది. '8 AMమెట్రో'తో మార్క్ బాలీవుడ్ లో అడుగు పెట్టారు. అక్కడ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా ఐరా అవార్డును సాధించారు. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్న మార్క్ కె రాబిన్‌కి గద్దర్ అవార్డుతో ఇప్పుడు తగిన గుర్తింపు లభించినట్టు అయింది. 'దండోరా' చిత్రానికి ఆయన అందించిన పాటలు, సోల్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి, మరీ ముఖ్యంగా టైటిల్ సాంగ్ ప్రేక్షకులను కదిలించాయి. ‘దండోరా’ సినిమాని నేపథ్య సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లారు.
మార్క్ కె రాబిన్ కెరీర్‌లో ‘మల్లేశం’లాంటి మంచి చిత్రాలెన్నో ఉన్నాయి. తదుపరి ‘జాంబీ రెడ్డి’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చక్కని విజయాన్ని అందుకున్నాయి. ‘మళ్లీ కలుద్దాం’తో సైమా 2017 బెస్ట్ మ్యూజిక్ అవార్డు వచ్చింది. నోయిడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'డిలి బిలీ'కి సైతం అవార్డు వచ్చింది. ‘సూర్యకాంతం’ సినిమాకి మార్క్ ఇచ్చిన సంగీతానికి మిర్చి మ్యూజిక్ నుంచి బెస్ట్ అప్ కమింగ్ కంపోజర్ అవార్డు వచ్చింది. ‘మల్లేశం’ సినిమాలోని ‘నాకు నువ్వని’ పాటకి బెస్ట్ కంపోజర్‌గా మిర్చి మ్యూజిక్ అవార్డ్ లభించింది. ఇప్పటి వరకు ఆయన దాదాపు 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు.