మాట్లాడలేదు, గుర్తు పట్టలేదు.. రామ్ వీడియోలతో ప్రాణం నిలబెట్టుకుంటున్న యువతి

ABN , Publish Date - Aug 19 , 2026 | 09:00 AM

సినీ హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు.

ram

సినీ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా ఉంటూ చదువుల్లో ముందున్న ఆ అమ్మాయిని.. నేడు ఓ అరుదైన జన్యు వ్యాధి మంచానికే పరిమితం చేసింది. కనీసం మాట్లాడలేని, గుర్తు పట్టలేని స్థితిలోనూ ఆ అభిమాన హీరో పేరు వింటే మాత్రం ఆమె కళ్లల్లో మెరుపు కనిపిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశి భవ్యత (Shashi Bhavyata). వయసు పద్దెనిమిదేళ్లు. అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. చక్కటి ప్రతిభ కనబరుస్తూ కుటుంబానికి వెలుగుగా నిలుస్తుందనుకున్న కూతురి జీవితంలో 2022 నుంచి ఊహించని కష్టం మొదలైంది.


మూడు తరాలుగా కుటుంబంలో జరుగుతున్న మేనరికపు వివాహాల కారణంగా శశి భవ్యత అరుదైన జన్యుపరమైన సమస్య బారిన పడింది. 2022లో మొదలైన ఫిట్స్ సమస్య క్రమంగా తీవ్రరూపం దాల్చింది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో మతిస్థిమితం కోల్పోయి పూర్తిగా మంచానికే పరిమితమైంది. పెద్ద ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక, దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఆమెను రాజమహేంద్రవరం జీజీహెచ్ (Rajamahendravaram GGH) లో చేర్పించారు.

చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయినా, తన అభిమాన హీరో రామ్ పాటలు వింటూ ఆ బాధను తట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ యువతి. సరైన వైద్యం అందితే తమ బిడ్డ మళ్లీ మామూలు మనిషి అవుతుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం, ప్రభుత్వం అందించే తోడ్పాటు కోసం ఎదురు చూస్తున్నారు.

Updated Date - Aug 19 , 2026 | 09:00 AM