మల్లారెడ్డి కాలేజ్ మొత్తం 'టాక్సిక్' మయం..
ABN , Publish Date - Aug 22 , 2026 | 09:37 PM
కేజీఎఫ్ సిరీస్ ద్వారా పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్
కేజీఎఫ్ సిరీస్ ద్వారా పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ (Toxic: A Fairy Tale for Grown-Ups). ఈ భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామాను జాతీయ పురస్కార గ్రహీత, నటి-దర్శకురాలు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించగా.. కియారా అద్వానీ, లేడీ సూపర్ స్టార్ నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను కూడా పెంచేశాయి. ఒక మహిళా దర్శకురాలు సుమారు రూ. 500 నుండి 600 కోట్ల బిగ్ బడ్జెట్‌తో ఇంతటి ఇంటెన్స్ యాక్షన్ చిత్రాన్ని రూపొందించడం భారతీయ చిత్రసీమలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ సినిమా ఆగస్టు 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొందడంతో ప్రమోషన్స్ చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాదులోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో అభిమానుల మధ్య ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకకు హీరో యష్, హీరోయిన్లు కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ హాజరయ్యారు. దీంతో మల్లారెడ్డి కాలేజ్ మొత్తం టాక్సిక్ మయం అయ్యింది. యష్ కోసం అభిమానులు క్యూ కట్టారు. ఇక దిల్ రాజు.. సినిమా గురించి మాట్లాడుతూ టాక్సిక్ కచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని తెలిపారు. అంతేకాకుండా యష్ తో ఒక సినిమా చేయాలి. దానికి ఆయన ఓకే కూడా చెప్పారు. కథ దొరికినప్పుడు యష్ నే కాల్ చేసి చెప్తాను అని చెప్పారు.