సిరివెన్నెల దాచుకున్న పాటలు తెరపైకి.. యండమూరి కథతో కొత్త సినిమా

ABN , Publish Date - Nov 27 , 2026 | 09:50 AM

యండమూరి వీరేంద్రనాథ్ కథతో కృష్ణ మురళి కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. సిరివెన్నెల ఉపయోగించకుండా దాచుకున్న సాహిత్యానికి యోగేశ్వర్ శర్మ సంగీతం అందించనున్నారు.

yandamuri sirivennela

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) కథతో టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన సినిమా తెరకెక్కనుంది. విభిన్న కథాంశాలతో సినిమాలు రూపొందించే దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు కృష్ణ మురళి (Krishna Murali) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శిరీష కొండమూరి (దాసరి), శ్రీధర్ అడబాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, శ్రీనివాస్ వడ్లమాని, అర్చన, దివి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. దివంగత ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) సినిమాల కోసం రాసి, ఉపయోగించకుండా దాచుకున్న కొన్ని సాహిత్యాన్ని ఈ చిత్రంలో వినియోగించనున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. సిరివెన్నెల తన కలం నుంచి జాలువార్చిన ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అలాంటి ఆయన రాసి దాచుకున్న సాహిత్యం ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.

ఈ చిత్రానికి సిరివెన్నెల తనయుడు యోగేశ్వర్ శర్మ (Yogeshwar Sharma) సంగీతం అందించనున్నారు. తండ్రి రాసిన సాహిత్యానికి తనయుడు స్వరాలు సమకూర్చనుండటం ఈ ప్రాజెక్ట్‌లో మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. యండమూరి వీరేంద్రనాథ్ కథ, సిరివెన్నెల సాహిత్యం, యోగేశ్వర్ శర్మ సంగీతం, తనికెళ్ల భరణి వంటి అనుభవజ్ఞులైన నటీనటుల కలయికతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Updated Date - Nov 27 , 2026 | 10:04 AM