వేంకటేశ్వర స్వామి.. పాత్ర లేకపోతే ఈ సినిమానే లేదు
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:38 AM
శ్రీకాంత్, లయ హీరో, హీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ .
శ్రీకాంత్ (Srikanth), లయ (Laya) హీరో, హీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ప్రధాన పాత్రలో జి.నాగేశ్వర్ రెడ్డి (G. Nageswar Reddy) రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ (Mister Middle Class) ఈనెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు వీవీ వినాయక్, కోన వెంకట్, దశరథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘వేంకటేశ్వర స్వామి పాత్ర లేకపోతే ఈ సినిమానే లేదు. అలాంటి గొప్ప పాత్ర రాజేంద్రప్రసాద్‌కు రావడం ఆయన అదృష్టం. ఈ చిత్రంలో ఆయన పాత్ర పెద్ద హైలెట్‌గా నిలుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్లు పడే కష్టాలను వినోదాత్మకంగా చెప్పడం ఒక గొప్ప కళ. ఆ విషయంలో దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు’ అని అన్నారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘వేంకటేశ్వర స్వామి పాత్ర చేయాలని నాగేశ్వర్ రెడ్డి చెప్పినప్పుడు చాలా ఆలోచించాను. ఎన్టీఆర్ గారు పోషించిన పాత్రలన్నీ నాకు గుర్తొచ్చాయి. అలాంటి పాత్రలు చేయాలంటే చాలా భయం, భక్తి ఉండాలి. అందుకే ఈ పాత్రను ఎంతో నిష్ఠతో చేశాను’ అని చెప్పారు. ‘అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలతో సినిమా ఉంటుందని, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది’ అని నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత చందు, నటుడు అలీ తదితరులు మాట్లాడారు.