అఖిల్ కొట్టాడు.. ఇప్పుడు వరుణ్ వంతు
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:40 PM
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో వరుణ్ తేజ్ కూడా ఒకడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో వరుణ్ తేజ్(Varun Tej) కూడా ఒకడు. ఈ మెగా హీరో హిట్ ముఖం చూసి చాలా ఏళ్లు దాటింది. ఎఫ్ 3 తరువాత వరుణ్ ఖాతాలో ఒక్క హిట్ పడింది లేదు. నిజం చెప్పాలంటే ఎఫ్ 3 ని కూడా వరుణ్ ఖాతాలో వెయ్యలేం. సింగిల్ హీరోగా అంటే గద్దలకొండ గణేష్ తరువాత మంచి విజయాన్ని అందుకోలేదు వరుణ్. ట్రెండ్ కి తగ్గట్లు కథలను ఎంచుకున్నా.. ట్రెండ్ అయ్యాక సినిమాలు రిలీజ్ అవ్వడంతో వరుణ్ కి ఆశించిన ఫలితాలు దక్కలేదు. కానీ, ఈసారి మాత్రం వరుణ్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు అనేది టాలీవుడ్ వర్గాల మాట.
వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరియన్ కనకరాజు. హర్రర్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను కూడా పెంచేశాయి. ఇక ఈ సినిమాపై వరుణ్ సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దీనికోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. కాలికి గాయం అయినా కూడా లెక్కచేయకుండా వరుణ్.. కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.
కథను నమ్మి వరుణ్ ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య హర్రర్ కామెడీ చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ట్రెండ్ కి తగ్గట్లు కరెక్ట్ టైమ్ కి వరుణ్ కొరియన్ కనకరాజుతో వస్తున్నాడు. ఇక కథను నమ్మి అఖిల్.. లెనిన్ తో మంచి హిట్ ని అందుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన హిట్ అఖిల్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు వరుణ్ కూడా కొరియన్ కనకరాజు సినిమాతో లెనిన్ లాంటి మంచి హిట్ నే అందుకుంటాడని మెగా ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి కొరియన్ కనకరాజు సినిమాతో వరుణ్ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.