Pongal Movies: అప్పుడు గేమ్ ఛేంజర్.. ఇప్పుడు రాజా సాబ్..

ABN , Publish Date - Jan 09 , 2026 | 09:14 PM

పొంగల్ బరిలో ముందుగా దూకినవారికే అడ్వాంటేజ్ అంటారు. కానీ, గత పదేళ్ళ సంక్రాంతి సీజన్ చూస్తే ముందొచ్చిన స్టార్ మూవీస్ కే పలుమార్లు దెబ్బ పడింది.

Pongal Movies

Pongal Movies: పొంగల్ బరిలో ముందుగా దూకినవారికే అడ్వాంటేజ్ అంటారు. కానీ, గత పదేళ్ళ సంక్రాంతి సీజన్ చూస్తే ముందొచ్చిన స్టార్ మూవీస్ కే పలుమార్లు దెబ్బ పడింది. ఈ సారి పొంగల్ రేసులోనూ ఫస్ట్ వచ్చిన స్టార్ కే చుక్కలు కనిపించాయని అంటున్నారు. ఈ యేడాది ఆరంభంలో కొన్ని సినిమాలు రిలీజ్ అయినా, మొట్టమొదట రిలీజైన స్టార్ మూవీగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) 'ద రాజాసాబ్ (The Raja Saab)' నిలచింది. జనవరి 9న రిలీజైన 'ద రాజాసాబ్' టాక్ చాలా వీక్ గా ఉంది. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బజ్జుంటుందనే చెబుతున్నారు ట్రేడ్ పండిట్స్.

ఈ ఏడాదితో కలిపి వెనక్కి వెళ్ళి మరో తొమ్మిదేళ్ళ సంక్రాంతి సినిమాల సందడిని చూసినా ఓ విషయం తేటతెల్లమవుతోంది. అదేమిటంటే ఈ పదేళ్ళ కాలంలో పొంగల్ సీజన్ లో ముందుగా వచ్చిన స్టార్ మూవీస్ ఏవీ అంతగా అలరించలేదని తేల్చేశారు. అయితే కొన్నిసార్లు ముందుగా వచ్చిన స్టార్స్ సక్సెస్ చూసిన దాఖలాలూ ఉన్నాయి. పదేళ్ళ వెనక్కి వెళితే 2017 సంక్రాంతిలో ముందుగా చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' సందడి చేసింది. ఈ మూవీ చిరంజీవి రీ ఎంట్రీగా వచ్చి మంచి విజయాన్ని మూటకట్టుకుంది.

ఇక 2018లో సంక్రాంతి రేసులో ముందుగా దూకిన స్టార్ మూవీ పవన్ కళ్యాణ్ 'అజ్ఙాతవాసి'...ఈ సినిమా పరాజయం పాలయ్యింది. ఆ తరువాతి సంవత్సరం బాలకృష్ణ 'యన్టీఆర్ - కథానాయకుడు'తో పొంగల్ బరిలో ముందుగా దూకారు... చేదు అనుభవం చవిచూశారు. 2020లో సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన స్టార్ మూవీ మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'... ఈ సినిమా మంచి వసూళ్ళు చూసినా, తరువాత వచ్చిన 'అల వైకుంఠపురములో' ముందు సత్తా చాటలేకపోయింది. 2021 పొంగల్ బరిలో ముందుగా రవితేజ 'క్రాక్' దూకింది... మంచి విజయాన్ని మూటకట్టుకుంది.. 2022 సంక్రాంతికి ముందుగా వచ్చింది రానా '1945'... ఆ సినిమా అంతే సంగతులు అన్న విషయం తెలిసిందే... 2023 సంక్రాంతి రేసులో ముందుగా దూకిన స్టార్ మూవీ బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' మంచి విజయాన్ని అందుకుంది.

ఈ యేడాదికి ముందు రెండు సంవత్సరాలను చూస్తే - 2024 లో సంక్రాంతికి వచ్చిన మొదటి స్టార్ మూవీ 'గుంటూరు కారం' కొనుగోలుదారుల కంట్లో కారం కొట్టింది... ఇక 2025 పొంగల్ బరిలో అడుగేసిన తొలి స్టార్ సినిమా రామ్ చరణ్ 'గేమ్ చేంజర్'... ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది... ఈ యేడాది సంక్రాంతి బరిలో దూకిన ఫస్ట్ స్టార్ మూవీ ప్రభాస్ 'ద రాజాసాబ్' కూడా అదే తీరున సాగుతోందని టాక్... దాంతో వరుసగా మూడేళ్ళు సంక్రాంతి సందడిలో ముందుగా అడుగేసిన స్టార్స్ చేదు అనుభవాన్నే చవిచూశారని తెలుస్తోంది... ఈ పదేళ్ళలో పొంగల్ సీజన్ లో ముందుగా బరిలోకి దూకిన స్టార్ మూవీస్ లో 'ఖైదీనంబర్ 150, సరిలేరు నీకెవ్వరు, క్రాక్, వీరసింహారెడ్డి' మాత్రమే విజయ పథంలో పయనించాయి... ఈ సారి సక్సెస్ తోనే స్టార్ హీరో సందడి చేస్తాడనుకుంటే నిరాశే మిగిలిందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు...

Updated Date - Jan 09 , 2026 | 09:14 PM