థియేటర్ల మాదిరిగానే ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌?

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:52 PM

ఓటీటీ (OTT) వేదికల్లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై కూడా థియేటర్లలో విడుదలయ్యే చిత్రాల మాదిరిగానే సెన్సార్‌ నిబంధనలు అమలు చేయాలా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఓటీటీ (OTT) వేదికల్లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై కూడా థియేటర్లలో విడుదలయ్యే చిత్రాల మాదిరిగానే సెన్సార్‌ నిబంధనలు అమలు చేయాలా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన  పంజాబీ చిత్రం 'సత్లూజ్ చుట్టూ నెలకొన్న వివాదం దీనికి కారణం అని చెబుతున్నారు  ప్రఖ్యాత గాయకుడు, నటుడు దిల్జిత్‌ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల ZEE5 ఓటీటీ వేదికలో విడుదలైంది. పంజాబ్‌ చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశాన్ని ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ చిత్ర నిర్మాతలు 2022లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు  పంజాబ్ 95 (Punjab 95) పేరుతో సెన్సార్‌ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేశారు. అయితే, సెన్సార్‌ బోర్డు సూచించిన 127  కట్స్‌ చేయడానికి నిర్మాతలు అంగీకరించకపోవడంతో చిత్రానికి సర్టిఫికెట్‌ జారీ కాలేదు. అనంతరం సినిమాను 'సత్లూజ్' పేరుతో నేరుగా ZEE5లో విడుదల చేశారు.

ఓటీటీ వేదికలపై ప్రస్తుతం అమల్లో ఉన్న స్వీయ నియంత్రణ (Self-Regulation) వ్యవస్థ సరిపోతుందా? లేక సినిమాల తరహాలో ముందస్తు సెన్సార్‌ విధానం తీసుకురావాలా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు జాతీయ ప్రసారం చేస్తుంది. దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం లేదా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీటీ కంటెంట్‌పై కూడా సెన్సార్‌ విధిస్తే సృజనాత్మక స్వేచ్ఛకు, భావ వ్యక్తీకరణ హక్కుకు భంగం కలుగుతుందని సినీ, డిజిటల్‌ రంగాలకు చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, దేశ భద్రత, సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లేదా తీవ్ర వివాదాలకు దారితీసే కంటెంట్‌పై మాత్రం కఠిన నియంత్రణ అవసరమని మరికొందరు వాదిస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే, భారతదేశంలో ఓటీటీ రంగం పనితీరులో అది కీలక మార్పుకు నాంది పలికే అవకాశముంది. భవిష్యత్తులో డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై కూడా సెన్సార్‌ నిబంధనలు అమల్లోకి వస్తాయా? అనే ఆసక్తి ఇప్పుడు సినీ, డిజిటల్‌ వర్గాల్లో నెలకొంది.

Updated Date - Jul 11 , 2026 | 05:53 PM