బాలకృష్ణతో రెండో సినిమా.. హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ వీరే

ABN , Publish Date - Jul 25 , 2026 | 08:29 PM

బాలయ్యతో గోపీచంద్ మలినేని తీస్తోన్న రెండో సినిమా ఏ తీరున సాగుతుందో అన్న అంశంపై సినీజనం చర్చించుకుంటున్నారు.

Balakrishna

నటసింహ నందమూరి బాలకృష్ణ యాక్సిడెంట్ కారణంగా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. బాలయ్యతో గోపీచంద్ మలినేని తీస్తోన్న రెండో సినిమా ఏ తీరున సాగుతుందో అన్న అంశంపై సినీజనం చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలయ్యకు ఫస్ట్, సెకండ్ మూవీస్ తో వరుసగా హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ సరసన గోపీచంద్ చేరతారా అన్న విషయంపైనా డిస్కషన్స్ సాగుతున్నాయి.

బాలకృష్ణ (Balakrishna)కు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) సినిమా షూటింగ్ లో ఉండగానే ప్రమాదం జరిగింది. శస్త్రచికిత్స కూడా జరిగి ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దాంతో షూటింగ్ కు అంతరాయం అనివార్యమయింది. మళ్ళీ ఎప్పుడు షెడ్యూల్ మొదలవుతుందో అని అభిమానులు యోచిస్తున్నారు. బాలయ్యకు షూటింగ్స్ లో ప్రమాదం జరగడం కొత్తేమీ కాదు - అలా జరిగినప్పుడు సదరు చిత్రాలు పెద్దగా అలరించలేదు. ఈ క్రమంలోనే బాలకృష్ణతో ఫస్ట్ మూవీ వీరసింహారెడ్డి (Veera Simha Reddy)తో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని రెండో సినిమాతో ఏ తీరున సాగుతారో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బాలయ్యకు తొలి సినిమాతోనూ, రెండో చిత్రంతోనూ వరుసగా హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కొందరున్నారు. వారి సరసన గోపీచంద్ కూడా చేరతారా అన్న అంశంపైనే అభిమానుల చర్చ.

వరుసగా రెండు విజయాలు.

బాలకృష్ణ కెరీర్ లో ఆయనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన క్రెడిట్ కోడి రామకృష్ణ (Kodi Ramakrishna)కు దక్కుతుంది. బాలయ్య- కోడి కాంబోలో తొలి సినిమాగా 'మంగమ్మగారి మనవడు' వచ్చి అనూహ్య విజయం సాధించింది. ఆ తరువాత వీరిద్దరి రెండో సినిమాగా 'ముద్దుల క్రిష్ణయ్య' కూడా గోల్డెన్ జూబ్లీ చూసింది. 'కథానాయకుడు'తో బాలయ్యకు ఫస్ట్ హిట్ ఇచ్చిన కె.మురళీమోహనరావు రెండో సినిమా 'కలియుగ కృష్ణుడు'తోనూ మురిపించారు. బాలయ్యతో కోదండరామిరెడ్డి తొలి సినిమా 'అనసూయమ్మగారి అల్లుడు' బంపర్ హిట్, వారిద్దరి కాంబోలో వచ్చిన రెండో మూవీ 'భార్గవరాముడు' ఆ స్థాయిలో అలరించలేక పోయినా, సక్సెస్ రూటులో సాగింది. తాతినేని రామారావు డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటించిన "ప్రెసిడెంట్ గారి అబ్బాయి, తల్లిదండ్రులు" రెండూ మంచి విజయం సాధించాయి. బాలయ్యతో ముత్యాల సుబ్బయ్య "ఇన్ స్పెక్టర్ ప్రతాప్, పవిత్ర ప్రేమ"తో సక్సెస్ చూశారు. బాలయ్య - సింగీతం శ్రీనివాసరావు కాంబోలో తొలి సినిమా 'ఆదిత్య 369' మురిపించింది- వారి రెండో సినిమా 'భైరవద్వీపం' బంపర్ హిట్ గా నిలచింది... శరత్ కూడా బాలయ్యకు "వంశానికొక్కడు, పెద్దన్నయ్య"తో వరుస హిట్స్ ఇచ్చారు...

'హ్యాట్రిక్' డైరెక్టర్స్.

బాలకృష్ణతో వరుసగా రెండు సినిమాలతో విజయం సాధించిన వారే కాదు కంటిన్యూగా మూడు చిత్రాలు సక్సెస్ చేసి 'హ్యాట్రిక్' చూసినవారూ ఉన్నారు..బాలయ్యతో కోడి రామకృష్ణ వరుసగా- మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య- సినిమాలతో నాలుగు హిట్స్ చూశారు. అదే తీరున బాలయ్యతో బి.గోపాల్ 'లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు" చిత్రాలతో నాలుగు వరుస విజయాలను నమోదు చేశారు. వీరిద్దరి సరసన ఎవరు చేరుతారో అని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తూ వచ్చారు. వీరి తరువాత బాలయ్యతో వరుసగా మూడు చిత్రాలతో బంపర్ హిట్స్ చూసిన డైరెక్టర్ గా బోయపాటి శ్రీను (Boyapati Srinu) నిలిచారు. "సింహా, లెజెండ్, అఖండ"తో హ్యాట్రిక్ సాధించారు బోయపాటి. ఈ హ్యాట్రిక్ డైరెక్టర్స్ సంగతి ఎలా ఉన్నా మలినేని గోపీచంద్ కు ఇప్పుడు రెండో సినిమాతోనే లిట్మస్ టెస్ట్ ఉంది. బాలయ్య-గోపీచంద్ రెండో చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తే అలా వరుసగా హీరోకు రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ జాబితాలో గోపి కూడా చేరతారు. ఏమవుతుందో చూడాలి.

Updated Date - Jul 25 , 2026 | 08:47 PM