పండు ఇంక డ్యాన్స్ చేయలేడా.. వైద్యులు ఏమన్నారంటే
ABN , Publish Date - Jun 03 , 2026 | 07:02 PM
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు (Pandu) రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు (Pandu) రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ఈవెంట్ ముగించుకుని తిరిగి వస్తుండగా, రోడ్డు పక్కన కారు ఆపి దిగిన పండును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను వైజాగ్‌లోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది.
ఇక డ్యాన్స్ మాస్టర్ అంటే కాళ్ళు రెండు పనిచేయాలి. పండు చాలా మంచి డ్యాన్సర్. ఢీలో ఆయన చేసిన డ్యాన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రమాదం వలన ఆయన జీవితంలో డ్యాన్స్ చేయగలడా అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నే డాక్టర్ ని అడుగగా.. పండు ప్రాణానికి ముప్పు లేదు.. కానీ, ఎక్కువ బెస్ట్ రెస్ట్ కావాలని తెలిపారు.
' పండుకి ఎడమ వైపు జాయింట్ జారిపోవడంతో పాటు, మోకాళ్ల కింద, చీలమండ పైభాగంలో రెండు కాళ్ల ఎముకలు విరిగాయి. జారిపోయిన జాయింట్‌ను వైద్యులు ఇప్పటికే సరిచేశారు. విరిగిన ఎముకలను అతికించడానికి ఈరోజు రెండు కాళ్లకు బోన్ ఫిక్సేషన్ సర్జరీ జరగనుంది. అతనికి మళ్ళీ లేవడానికి ఆరు నెలలు పడుతుంది. అప్పుడు అతని పనులు చేసుకోగలడు' అని తెలిపారు. దీంతో పండు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పండు త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని కోరుకుంటున్నారు.