చిరునే కావాలంటున్న బుచ్చిబాబు..

ABN , Publish Date - Sep 08 , 2026 | 08:03 PM

ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న బుచ్చిబాబు సానా.. తన రెండో సినిమా పెద్ది కోసం చాలా కష్టపడ్డాడు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది ఎన్నో అంచనాల నడుమ ఈ ఏడాది రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

Chiranjeevi

ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న బుచ్చిబాబు సానా (Buchhi Babu Sana).. తన రెండో సినిమా పెద్ది కోసం చాలా కష్టపడ్డాడు. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కిన పెద్ది ఎన్నో అంచనాల నడుమ ఈ ఏడాది రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ విజయంతో పాటు ఎన్నో విమర్శలను కూడా అందుకుంది. పెద్ది తరువాత బుచ్చి బయట ఎక్కడా కనిపించింది లేదు. ఇక పెద్ది తరువాత బుచ్చి ప్లాన్ ఏంటి.. ? ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు.. ? ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజాగా ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందని టాక్ కూడా నడుస్తోంది.


ఓవర్సీస్, నార్త్ బెల్ట్‌లో క్లైమాక్స్ సన్నివేశాల అతి ఎమోషన్ వర్కౌట్ కాకపోయినప్పటికీ, బుచ్చిబాబు రాసుకున్న పెద్ది విలేజ్ స్పోర్ట్స్ డ్రామా మేకింగ్ తీరు మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చేసింది. రామ్ చరణ్ కంటే కూడా చిరంజీవినే ఈ సినిమా మేకింగ్ విశేషంగా ఆకట్టుకుందట. దాంతో బుచ్చిబాబు దర్శకత్వ శైలిపై మెగాస్టార్ ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నారని సమాచారం. ఉప్పెన నుంచి పెద్ది వరకు ఆయన చూపించిన టేకింగ్, విజువల్స్ పట్ల చిరు ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి బుచ్చి.. చిరుతోనే సినిమా ప్లాన్ చేసినట్లు సమాచారం.


ప్రస్తుతం బుచ్చిబాబు.. చిరు కోసమే కథను రాస్తున్నాడట. అయితే ఈసారి ఎలాంటి శారీరక త్యాగాలు, భావోద్వేగాల బరువులు, సందేశాలు లేకుండా కేవలం అభిమానులు కోరుకునే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ లైన్‌ను సిద్ధం చేస్తున్నాడట. చిరంజీవికి ఈ కథ నచ్చితే వెంకటేశ్వర లేదా మైత్రీ సంస్థల్లో ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఏవైనా మార్పులు చెప్పినా, లేదా కథ ఓకే కాకపోయినా ప్రత్యామ్నాయ కథతోనైనా మెగాస్టార్‌ను ఒప్పించాలని బుచ్చిబాబు పట్టుదలతో ఉన్నాడని టాక్.


ఇంకోపక్క చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం కాకా సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఆయన, ఆ తర్వాత విశ్వంభర విడుదలను పూర్తి చేయాల్సి ఉంది. ఆపై శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనేది శ్రీకాంత్ నెక్స్ట్ సినిమా ప్యారడైజ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు వెంకీ అట్లూరి కూడా చిరుతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నా, ఆయన వద్ద సరైన పాయింట్ సిద్ధంగా లేదని టాక్.. మరి ఈ సమీకరణాల మధ్య మెగాస్టార్ 159వ చిత్రాన్ని దక్కించుకుని బుచ్చిబాబు మళ్ళీ ట్రాక్‌లోకి వస్తాడో లేదో చూడాలి.

Updated Date - Sep 08 , 2026 | 08:03 PM