ఉస్తాద్ భగత్ సింగ్' టిక్కెట్ రేట్ల పెంపు... ఓ తేడా !
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:49 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టిక్కెట్ రేట్లు పెంచుకొనే వీలు కలిగింది.... అయితే ఈ రెండు స్టేట్స్ లో టిక్కెట్ రేట్స్ హైక్ లో ఎంతో వ్యత్యాసం ఉండడం గమనార్హం!... ఎందుకలాగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan Kalyan) 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat singh) కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టిక్కెట్ రేట్లు పెంచుకొనే వీలు కలిగింది.... అయితే ఈ రెండు స్టేట్స్ లో టిక్కెట్ రేట్స్ హైక్ లో ఎంతో వ్యత్యాసం ఉండడం గమనార్హం!... ఎందుకలాగా !? (Ticket rates hike)
తెలంగాణలో స్వల్పంగా...
పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 19న ఉగాది కానుకగా రిలీజ్ కానుంది... ఈ సినిమా టిక్కెట్స్ రేట్స్ హైక్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ తెలంగాణలో ఉన్న '90 రోజుల నిబంధన'ను సవాల్ చేస్తూ ఇటీవల సుప్రీమ్ కోర్టును ఆశ్రయించి, విజయం సాధించారు... దాంతో తెలంగాణలోనూ టిక్కెట్ రేట్స్ పెంచుకొనే వీలు కలిగింది... అయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి సెంటర్ లో విపరీతమైన టిక్కెట్ రేట్స్ పెంచితే దాని ప్రభావం సినిమాపైనా పండుతుందని నిర్మాతలు భావించారు... అందువల్ల నైజామ్ ఏరియాలో మల్టీప్లెక్స్ టిక్కెట్ ను 295 రూపాయలుగానూ, సింగిల్ స్క్రీన్ టిక్కెట్ ను 175 రూపాయలుగానూ నిర్ణయించారు... గతంలో టాప్ స్టార్స్ మూవీస్ కు ఏకంగా సెంట్ పర్సెంట్ టిక్కెట్ రేట్స్ హైక్ చేసేవారు... ఉదాహరణకు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 250 ఉన్న టిక్కెట్ ను 500 రూపాయలకు అమ్మిన సందర్భాలూ ఉన్నాయి... అయితే ప్రేక్షకులకు పెద్దగా ఇబ్బంది లేకుండా 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం మల్టీప్లెక్స్ లో 95 రూపాయల హైక్, సింగిల్ స్క్రీన్స్ లో 25 రూపాయల పెంపు నిర్ణయించారు... దాంతో నైజామ్ లో బుకింగ్స్ ఓపెన్ కాగానే టిక్కెట్స్ స్పీడుగా అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది...
ఏపీలో వేరే తీరు... !
'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం తెలంగాణలో మల్టీప్లెక్స్ లో 295 , సింగిల్ థియేటర్స్ లో 175 రూపాయల టిక్కెట్ రేట్లు నిర్ణయించారు... బాగానే ఉంది- కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అమలులో ఉన్న టిక్కెట్ రేటుపై మల్టీప్లెక్స్ లో 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయల వరకు పెంచుకొనే వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీరున చూస్తే ఏపీలో మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలనుకొనేవారు టిక్కెట్ రేటుపై అదనంగా 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది... అంటే 200 రూపాయల టిక్కెట్ అక్కడ 325 రూపాయలు అవుతుంది... అలాగే సింగిల్ థియేటర్స్ లో 100 రూపాయల టిక్కెట్ - రెండు వందలు కావచ్చు. మరి 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్ ఈ వ్యత్యాసం ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోస్ మూవీస్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే తీరున టిక్కెట్ రేట్ల పెంపు ఉండేది. రద్దీని బట్టి థియేటర్ యాజమాన్యమే పెంపులో కొంత తగ్గించి అమ్ముకున్న దాఖలాలూ ఉన్నాయి... అయితే ఈ సారి మాత్రం తెలంగాణలో తక్కువగా పెంచి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మల్టీప్లెక్స్ లో 125 రూపాయలు, సింగిల్ థియేటర్స్ లో 100 రూపాయలు పెంచడం చర్చనీయాంశమయింది...
ఎందుకీ తేడా...!
వాస్తవానికి తెలుగు సినిమా రంగం, అందుకు సంబంధించిన నిర్మాతలు అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు. పైగా హైదరాబాద్ లో సీమాంధ్రులు అధికసంఖ్యలో ఉన్న కారణంగా నగరంలోనే మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్స్ లో టిక్కెట్స్ బాగా తెగుతాయి. దానిని దృష్టిలో పెట్టుకొనే కాబోలు 'మైత్రీ మూవీమేకర్స్' తెలంగాణలోనే టిక్కెట్ రేట్లపై కొంతమేరకే పెంపు నిర్ణయించారు. మరి సినిమాలను విశేషంగా ఆదరించే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన టిక్కెట్ రేట్ల పెంపునే అమలు చేస్తున్నారు. అంటే తెలంగాణలోని ప్రేక్షకులకేమో తక్కువ పెంపు, ఆంధ్రప్రదేశ్ లోని ఆడియెన్స్ కు ఎక్కువ రేటు నిర్ణయించడం ఎంతవరకు సబబు అని సగటు ప్రేక్షకులు అంటున్నారు. మరి నిర్మాతలు ఈ తేడా ఎందుకు చూపించారో తెలియాల్సి ఉంది.