Ram Charan Akhil: చరణ్ Vs అఖిల్! తగ్గేదెవరు.. వచ్చేదెవరు
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:43 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న పెద్ది చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబోలో వస్తున్న పెద్ది (Peddi) చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామీణ నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ డ్రామా రూపుదిద్దుకుంటోంది. ఒక సామాన్య యువకుడు క్రీడల్లో రాణిస్తూ తన గమ్యాన్ని ఎలా ముద్దాడాడనే స్ఫూర్తిదాయకమైన కథాంశంతో బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహామాన్ సంగీతం అందిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌తో పాటు విలక్షణ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోనే ఉన్నప్పుడే మేకర్స్ విడుదల తేదీపై స్పష్టత ఇచ్చారు. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అభిమానులకు ఇది ఒక గొప్ప కానుకగా ఉంటుందని అందరూ ఆశించారు. అయితే, మార్చి 27న పెద్ది విడుదల కావడం కష్టంగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం కష్టంగా కనిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడిందట. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మే నెలలో ఏ రోజనే సస్పెన్స్‌కు తెరదించుతూ ఒకటవ తేదీనే చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ క్రేజీ అప్‌డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, అక్కినేని అఖిల్ (Akhil) తన తదుపరి చిత్రం ‘లెనిన్’ (Lenin) తో మే నెలలోనే బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాను మే 1వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అఖిల్ కెరీర్‌లో ఈ మూవీ చాలా కీలకం కావడంతో, దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు ఎంతో జాగ్రత్తగా ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. 'ఏజెంట్' వంటి పరాజయం తర్వాత అఖిల్ ఈ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మే 1వ తేదీన రామ్ చరణ్, అఖిల్ సినిమాల మధ్య పోటీ తప్పేలా లేదు. చరణ్, అఖిల్ మధ్య మంచి స్నేహం ఉన్న నేపథ్యంలో.. ఇద్దరూ చర్చించుకున్న తర్వాతే ఈ విడుదల తేదీల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమా అదే తేదీకి ఫిక్స్ అయితే, అఖిల్ తన సినిమా విడుదలను మే నెలలోనే మరో తేదీకి మార్చుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.