హనుమాన్ అంశ్.. అసలు ఎవరీ నీమ్ కరోలీ బాబా
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:53 PM
ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం హనుమాన్ అంశ్ గురించే చర్చ. కేవలం రూ. 2 కోట్ల లోపు అత్యల్ప బడ్జెట్‌తో రూపొందిన ఈ ఆధ్యాత్మిక చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.
ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం హనుమాన్ అంశ్ (Hanuman Ansh)గురించే చర్చ. కేవలం రూ. 2 కోట్ల లోపు అత్యల్ప బడ్జెట్‌తో రూపొందిన ఈ ఆధ్యాత్మిక చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సమర్పణలో సెప్టెంబర్ 18న తెలుగు వెర్షన్ విడుదల కానుంది. దీంతో అసలు ఇదేం సినిమా.. ? ఎవరి గురించి.. ? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఈ కథ నీమ్ కరోలీ బాబా గురించి అని తెలియడంతో ఆయన ఎవరు.. ? ఏం చేశారు.. ? అంటూ నెటిజన్స్ ఆయన గురించి వెతకడం స్టార్ట్ చేశారు .
నీమ్ కరోలీ బాబా అసలు పేరు లక్ష్మీ నారాయణ శర్మ. ఉత్తరప్రదేశ్‌లో నివసించే ఆయన చిన్న వయసులోనే లౌకిక జీవితాన్ని త్యజించి హనుమాన్ ఉపాసకునిగా మారారు. హనుమంతుడిపై అపారమైన భక్తితో ఆయననే ధ్యానిస్తూ ఉత్తరాఖండ్‌లోని కైంచీ ధామ్ లో ఆశ్రమాన్ని స్థాపించి నీమ్ కరోలీ బాబాగా ప్రసిద్ధి చెందారు.ఈ బాబా ఆధ్యాత్మిక మహిమలు కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తమ జీవితంలోని క్లిష్ట సమయాల్లో కైంచీ ధామ్ ఆశ్రమాన్ని దర్శించి స్ఫూర్తి పొందడం విశేషం. అంతేకాకుండా, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ సైతం బాబా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితురాలయ్యింది. దీంతో ఆయన ఆశ్రమానికి ఎంతో గొప్ప పేరు వచ్చింది.
ఇక హనుమాన్ అంశ్ సినిమా పూర్తిగా నీమ్ కరోలీ బాబా బయోపిక్ గా కాకుండా తల్లిలేని ఒక బాలుడు.. దేవుడిని వెతుక్కుంటూ సాగించే ప్రయాణంలో ఎలా సిద్ధపురుషుడిగా రూపాంతరం చెందాడనే ఆధ్యాత్మిక డ్రామాగా తెరకెక్కింది. ఇందులో లక్ష్మీ నారాయణ శర్మ ఎలా నీమ్ కరోలి బాబాగా మారారు అనేది చూపించారు. బాబా బాల్యం, ఆయన హనుమద్భక్తి, మానవాళికి ఆయన చేసిన సేవ చూపించారు. మధ్య మధ్యలో ఆయన చేసిన మహిమలను కూడా చూపించారు. హిందీలో ఓ రేంజ్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.