ప్రేక్షకులు తప్పక.. థ్రిల్ అవుతారు! అందుకే.. వాటిని ట్రైలర్‌లో చూపించలేదు
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:46 AM
అడివి శేష్ కథానాయకుడిగా షానిల్ డియో దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డెకాయిట్’ ట్రైలర్ శనివారం సాయంత్రం విడుదల చేశారు.
‘‘డెకాయిట్’ (Dacoit) ప్రాణం పెట్టి చేసిన సినిమా. ఈ చిత్రంలోని కీలకమైన మలుపులు, అంశాలను ట్రైలర్‌లో చూపించలేదు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ అవుతారు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటన ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ’ అని అడివి శేష్ (Adivi Sesh) అన్నారు.
ఆయన కథానాయకుడిగా షానిల్ డియో ( Shaneil Deo) దర్శకత్వం వహించిన చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మాత సుప్రియా యార్లగడ్డ, సహ నిర్మాత సునీల్ నారంగ్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. చిత్రబృందం శనివారం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
హరి, జూలియెట్ ప్రేమ గాథ నేపథ్యంలో భారీ యాక్షన్ అంశాలతో ట్రైలర్ ఆధ్యంతం అలరించింది. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ ‘తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే మంచి సినిమాలు చేయాలనేది నా కోరిక. ‘డెకాయిట్’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని చెప్పారు. సుప్రియా యార్లగడ్డ మాట్లాడుతూ ‘ఈ సినిమాను గ్రాండ్‌గా తీయాలని కథకు అవసరమైనవన్నీ సమకూర్చాం. మంచి సినిమా ఎప్పుడూ గెలుస్తుంది’ అని అన్నారు.
‘ఈ సినిమాలో నేను పోషించిన సరస్వతి పాత్ర నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప పాత్ర అవుతుంది’ అని మృణాల్ ఠాకూర్ చెప్పారు. ‘నా గత చిత్రాలకు భిన్నంగా కొత్త తరహా పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తాను’ అని అనురాగ్ కశ్యప్ తెలిపారు. ‘ఈ సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం, ఇదొక లైఫ్ టైమ్ మూవీగా నిలిచిపోతుంది’ అని షానీల్ డియో పేర్కొన్నారు.