Tollywood: జైకృష్ణ వచ్చేస్తున్నాడు!

ABN , Publish Date - Jul 29 , 2026 | 03:08 PM

ఈ వీకెండ్ లో మొత్తం ఆరు చిత్రాలు ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో నాలుగు స్ట్రెయిట్ మూవీస్ కాగా, ఒకటి అనువాద చిత్రం, మరోటి రీ-రిలీజ్. మరి ఈ వారంలో సినిమాలు ఎప్పుడు ఎలా జనాన్ని పలకరించబోతున్నాయో చూద్దాం.

This weekend movies

గత కొంతకాలంగా టాలీవుడ్ లో విపరీతంగా చర్చించుకుంటున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. సూపర్ కృష్ణ మనవడు, రమేశ్‌ బాబు తనయుడు జైకృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తుండటమే ఇందుకు కారణం. జూలై 30 గురువారం 'శ్రీనివాస మంగాపురం' విడుదల అవుతోంది. ఈ సినిమాను 'ఆర్.ఎక్స్. 100' ఫేమ్ అజయ్‌ భూపతి డైరెక్ట్ చేశారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ సమర్పణలో పి. కిరణ్‌ దీనిని నిర్మించారు. విశేషం ఏమంటే తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చితే, బాలీవుడ్ అందాల భామ, రవీనా టాండన్ కూతురు రాషా తడానీ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జైకృష్ణ బాబాయ్ ఈ నాటి స్టార్ హీరో మహేశ్ బాబు వైజయంతీ మూవీస్ నిర్మించిన 'రాజకుమారుడు'తో యంగ్ హీరోగా 1999లో ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ అప్పట్లో జూలై 30న విడుదలయింది. అదే తేదీకి జయకృష్ణ హీరోగా పరిచయమవుతోన్న 'శ్రీనివాస మంగాపురం'ను కూడా రిలీజ్ చేస్తూ ఉండడం విశేషంగా మారింది. ఘట్టమనేని నటవంశం మూడోతరం హీరోగా జైకృష్ణ ఎంట్రీ ఇస్తున్నారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణ, మహేశ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


జూలై 30నే వస్తున్న 'స్పైడర్ మేన్- బ్రాండ్ న్యూ డే' చిత్రానికీ క్రేజ్ బాగానే ఉంది. స్పైడర్ మ్యాన్ సీరిస్ ను అభిమానించే ప్రేక్షకులు మన దేశంలోనూ కోట్లలో ఉన్నారు. అందుకే ఈ ఆంగ్ల చిత్రాన్ని భారతీయ భాషల్లో డబ్ చేసి, ఒక రోజు ముందే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి దాకా మూడు స్పైడర్ మేన్ మూవీస్ లో నటించిన టామ్ హాలాండ్ ఈ తాజా చిత్రంలోనూ స్పైడర్ మేన్ గా అలరించనున్నారు. ఇటీవల విడుదలైన 'ఒడిస్సీ'లోనూ టామ్ హాలాండ్ తన నటనతో మెప్పించాడు.

జూలై 31 శుక్రవారం 'అదే నువ్వు- అదేనేను, న్యూటన్స్ థర్డ్ లా, కర్మాఖ్య' రిలీజ్ కానున్నాయి. సుమంత్ హీరోగా రూపొందిన 'న్యూటన్స్ థర్డ్ లా' ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో జగపతిబాబు, శ్రీనివాస్ అవసరాల, రవివర్మ, త్రినాథ్ వర్మ కీలక పాత్రధారులు. యూత్ కు ఓ సందేశమిచ్చే అంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని సమాచారం. గత యేడాది సుమంత్ నటించిన 'అనగనగా' సినిమా ఓటీటీకే పరిమితం అయ్యింది. అయితే ఆ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈటీవీ విన్ ఇప్పుడీ సినిమాకూ ప్రొడక్షన్ లో భాగమైంది. మొదటిలో పెద్దంతగా జనాలు ఈ మూవీని పట్టించుకోకపోయినా... ట్రైలర్ వచ్చిన తర్వాత ఇదేదో బాగానే ఉండేట్టుందనే భావన కలిగించింది.


జబర్దస్త్ తో పాపులారిటీని పొందిన 'అదిరే' అభి గత యేడాది 'చిరంజీవా' అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. అతని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రెండో సినిమా 'కామాఖ్య'. అయితే సెన్సార్ అభ్యంతరంతో ఈ సినిమా పేరును 'కర్మాఖ్య'గా మార్చారు. సముతిరకని, అభిరామి కీలక పాత్రలు పోషించిన ఆ సినిమాపై కూడా కాసింత ఆసక్తి నెలకొంది. ఓ గేటెడ్ కమ్యూనిటీలో జరిగే క్రైమ్, లవ్ అంశాలతో 'అదే నీవు- అదే నేను' రూపొందింది. ఇందులో 'కమిటీ కుర్రోళ్ళు' లో నటించిన కొందరు కీలక పాత్రలు పోషించారు. ఇక ఆగస్టు 1వ తేదీన రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర -2' రీ-రిలీజ్ కానుంది. ఇందులో సూర్య, వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రధారులు. అప్పట్లో 'రక్త చరిత్ర-1' బాగా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు 'రక్త చరిత్ర-2' విడుదల చేయడానికి కారణం సూర్యకు ఉన్న ఇమేజ్ అని చెప్పొచ్చు. మరి ఈ ఆరు సినిమాల్లో ప్రేక్షకులను ఏ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

సూర్య, రాజమౌళి క్రేజీ కాంబో టాక్.. సోషల్ మీడియా షేక్!

మోహన్‌ రాజా సరికొత్త అవతారం.. ఈ ట్విస్ట్ ఏంటి

‘మా’ ఆధ్వర్యంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు

Updated Date - Jul 29 , 2026 | 03:10 PM