Tollywood: ఈవారం నాలుగు స్ట్రయిట్... మూడు డబ్బింగ్...
ABN , Publish Date - Aug 13 , 2026 | 03:28 PM
ఈ వీకెండ్ లో ఏడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో నాలుగు స్ట్రయిట్ సినిమాలు కాగా మూడు అనువాద చిత్రాలు.
ఆగస్ట్ సెకండ్ వీకెండ్ థియేటర్లలో స్ట్రయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం సందడి చేయబోతున్నాయి. నాలుగు డైరెక్ట్ తెలుగు సినిమాలు వస్తుంటే, వాటికి దీటుగా మూడు అనువాద చిత్రాలు రాబోతున్నాయి. సూర్య హీరోగా సితార ఎంటర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' అందులో ఒకటి. మరొకటి ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో స్వర్గీయ ఆర్.బి. చౌదరి నిర్మించిన 'మకుటం'. ఈ మూవీ కోసం తొలిసారి హీరో విశాల్ దర్శకుడి అవతారమెత్తాడు. ఈ రెండు అనువాద చిత్రాలతో పాటే ఇంగ్లీష్ సినిమా 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' తెలుగులో వస్తోంది.
శుక్రవారం వస్తున్న సినిమాల్లో అందరూ దృష్టి సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' మీదనే ఎక్కువగా ఉంది. గత కొంతకాలంగా సరైన విజయం లేక సతమతమౌతున్న సూర్యకు ఈ యేడాది 'కరుప్పు8 రూపంలో మంచి విజయం లభించింది. ఆ వెనుకే 'విశ్వనాథ్ అండ్ సన్స్' రావడం సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు కలిసి వచ్చిన అంశం. యూత్ ను 'ప్రేమలు' చిత్రంతో మెస్మరైజ్ చేసిన మమిత బైజు నాయికగా నటించిన ఈ సినిమాలో రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ దీనికి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాతో పాటే వస్తున్న విశాల్ 'మకుటం' చిత్రానికీ జీవీ ప్రకాశ్ కుమారే సంగీత దర్శకుడు. ఇందులో అంజలి, దుషార విజయన్ కథానాయకులుగా నటించారు. ఇక ఈ వీకెండ్ లో వస్తున్న మరో అనువాద చిత్రం 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్'. డేవిడ్ రాబర్ట్ ఈ ఎడ్వంచర్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మించిన 'ది ఎండ్ ఆఫ్ ఓక్' మూవీలో హీరో కుటుంబం నివాసం ఉంటున్న వీధి అంతా రోదసిలో జరిగిన ఓ ఉపద్రవం కారణంగా వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ భయంకరమైన డైనోసర్స్ నుంచి అతని ఫ్యామిలీ ఎలా బయటపడిందనేది ఈ సినిమా కథ. 'జురాసిక్ పార్క్'ను గుర్తు చేసే ఈ సినిమా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
వీటితో పాటు వస్తున్న స్ట్రయిట్ సినిమాలలో ఎమ్మెస్ రాజు నిర్మిస్తున్న 'అగధ' శుక్రవారం వస్తోంది. కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ లో ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, శ్రవణ్ రెడ్డి కీలక పాత్రలు చేస్తున్నారు. కాశీ విశాలాక్షి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను కొత్త లోకాలకు తీసుకెళుతుందని ఎమ్మెస్ రాజు చెబుతున్నారు. అలానే అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న మరో సినిమా 'పళ్ళ బురుసు' సైతం శుక్రవారం వస్తోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను నూతన దర్శకుడు ఉదయ్ చౌహాన్ రూపొందించారు. 'బలగం'లో మామా అల్లుళ్ళుగా నటించిన సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇందులో తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఇక నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించిన 'పాంచాలి పంచభర్తృక' కూడా శుక్రవారం వస్తోంది.
ఇదిలా ఉంటే... సురేశ్ బాబు పంపిణీ చేస్తున్న 'హుషార్ పిట్టలు' సినిమా ఆగస్ట్ 15 శనివారం జనం ముందుకొస్తోంది. వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమాతో బిక్షు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో అన్షు, వాసవి గణేషన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మరి ఈ చిత్రాలలో ఏయే చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.
ఇవి కూడా చదవండి:
స్పా సెంటర్ లో నటికి ఏం జరిగిందంటే..
సుకుమార్ తనయ సుకృతి వేణికి అరుదైన ఘనత
సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ప్రభాస్ ఫోటో.. ఇలా ఉన్నాడేంటి