నరేశ్‌: హగ్‌ చేసుకోవాలనే వచ్చా.. కానీ అమ్మాయిలు చీరల్లో వచ్చారు..

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:22 PM

‘హే భగవాన్‌’ (Hey Bhagavan) సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ వేదికగా వీకే నరేశ్‌ (Vk Naresh) కీలక వ్యాఖ్యలు చేశారు.

Vk Naresh

‘హే భగవాన్‌’ (Hey Bhagavan) సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ వేదికపై వీకే నరేశ్‌ (Vk Naresh) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొన్ని పరిణామాల తర్వాత సినిమా ఫంక్షన్స్‌లో మహిళలందరూ చీరల్లోనే కనిపిస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతి' అని ఆయన అన్నారు. ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను నరేశ్‌ పరోక్షంగా గుర్తు చేసుకున్నారు. గురువారం హగ్‌ డే సందర్భంగా వేదికపై ఉన్న హీరోలు, దర్శక నిర్మాతలను హగ్‌ చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లు శివానీ నాగారం, స్రవంతి చొక్కారపు, యాంకర్‌ గీతాభగత్‌కు కూడా శుభాకాంక్షలు చెప్పి.. ‘మిమ్మల్ని కూడా హగ్‌ చేసుకోవాలనే వచ్చాను. కానీ.. మీరు లక్షణంగా చీరలు ధరించారు. ఈ మధ్యన చోటుచేసుకున్న కొన్ని పరిణామాల తర్వాత వేదికలపై చాలామంది చీరల్లోనే కనిపిస్తున్నారు’ అని సరదాగా అన్నారు. శివాజీ వస్త్రధారణపై వ్యాఖ్యలు చేసిన సమయంలో స్రవంతి చొక్కారపునే యాంకరింగ్ చేశారు. ఇప్పుడు ఆమె సమక్షంలోనే నరేశ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. రెగ్యులర్‌గా సినిమా ఈవెంట్స్ లో మోడ్రన్ డ్రస్‌ను ధరించే స్రవంతి ఇటీవల మాత్రం చీరలోనే దర్శనమిస్తున్నారు.

‘ఈ మధ్యనే ‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్‌ రాంబాయి’ చిత్రాలు చూశాను. అద్భుతంగా ఉన్నాయి. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి మంచి చిత్రాలు చేస్తున్నారు. వారు సినిమా రిలీజ్‌ చేస్తే గన్‌షాట్‌ హిట్‌ అని నమ్మవచ్చు’ అని నరేశ్‌ అన్నారు. సుహాస్‌ హీరోగా గోపీ దర్శకత్వం వహించిన చిత్రం ‘హే భగవాన్‌’. శివానీ నాగారం హీరోయిన్ కాగా, స్రవంతి కీలక పాత్రను పోషించారు. ఈ నెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సాయి దుర్గతేజ్‌ అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - Feb 12 , 2026 | 09:36 PM