Vishwak Sen: డబ్బు లేదని గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది.. వెక్కి వెక్కి ఏడ్చాను

ABN , Publish Date - Nov 24 , 2026 | 09:32 PM

ఈమధ్య కాలంలో సీక్వెల్స్ హిట్ అవ్వడం చాలా కష్టంగా మారింది. అయితే తరుణ్ భాస్కర్ మాత్రం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు.

Vishwak Sen

ఈమధ్య కాలంలో సీక్వెల్స్ హిట్ అవ్వడం చాలా కష్టంగా మారింది. అయితే తరుణ్ భాస్కర్ మాత్రం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకమాను, శివాత్మిక రాజశేఖర్,అనీషా ఆంబ్రోస్ కీలక పాత్రల్లో నటించిన ఈఎన్ఈ రీపీట్ (ENE Repeat) సినిమా నవంబర్ 20 న రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది. దీంతో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యాడు. ప్రీమియర్స్‌కు రెండు రోజుల ముందే ప్రసాద్ ల్యాబ్‌లో సినిమా చూసినప్పుడు తనకు మాటలు రావడానికి గంటన్నర పట్టిందని, దర్శకుడు తరుణ్ భాస్కర్ అందరి జీవితాల్లోని ఒక భాగాన్ని ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించాడని ప్రశంసలతో ముంచెత్తాడు.


ఈ నగరానికి ఏమైంది రిపీట్ గురించి మాట్లాడే ముందు ఈ నగరానికి ఏమైంది నాటి తన జర్నీని గుర్తుచేసుకున్నాడు విశ్వక్. 16 ఏళ్లకే ముంబైలో ఫిలిం స్కూల్‌లో జాయిన్ అయ్యి, 17 ఏళ్ల నుంచే చిన్న చిన్న ఆడిషన్లు ఇస్తూ స్ట్రగుల్ మొదలుపెట్టానని తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను విశ్వక్ సేన్ ఓపెన్‌గా పంచుకున్నాడు. 21 ఏళ్ల వయసులో ఆర్థిక ఇబ్బందుల కారణంగా గర్ల్‌ఫ్రెండ్ వదిలేసి వెళ్లిపోయిందని, ఒక సినిమాలో మొదట ఫస్ట్ హీరోగా అనుకుని తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ హీరోగా మార్చారని, చివరికి 20 రోజులు ఆఫీస్‌కు వెళ్లాక తనను ప్రాజెక్ట్ నుంచి తీసేసిన విషయం ఆలస్యంగా తెలిసిందని చెప్పాడు. ఆ సమయంలో ఇంటికెళ్లి రెండు మూడు రాత్రులు వెక్కి వెక్కి ఏడ్చానని, ఎవరూ సినిమాలు తీయకపోవడంతో 21 ఏళ్లకే డైరెక్షన్ చేసి ఫలక్‌నుమా దాస్ ప్రాజెక్ట్ మొదలుపెట్టానని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ ఆడిషన్స్ ద్వారా ఈ నగరానికి ఏమైందిలో అవకాశం రావడం, మధ్యలో ఒక ఫేక్ ఈమెయిల్ కారణంగా తనను సినిమా నుంచి తీసేసే పరిస్థితి వస్తే.. తరుణ్ తనపై నమ్మకం ఉంచి ఆ ఈమెయిల్ పంపడంతో 24 గంటల్లో నిజం నిరూపించుకున్నానని ఎమోషనల్ అయ్యాడు. పాతాళంలో పడిపోయే స్థితి నుంచి తరుణ్ కాపాడాడని, సినిమా వాళ్లు తప్పు చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ తిడతారని, ఆ హక్కు వారికి ఉన్నా.. అవి చూస్తే బాధేస్తోందని చెప్పుకొచ్చాడు.


తన జీవితంలో అత్యంత తక్కువ కష్టపడి, అత్యధిక పేరు తెచ్చిపెట్టిన సినిమాలు ఈ నగరానికి ఏమైంది1, 2 అని, తరుణ్ భాస్కర్ తనకు బ్లడ్ బ్రదర్ లాంటివాడని, తనలోని మంచి విషయాల్లో 50 శాతం తరుణ్ నుంచే నేర్చుకున్నానని చెప్పాడు. అలాగే తన కో-యాక్టర్స్, టెక్నీషియన్లు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నిన్ననే యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ అయిందని, రేపటికి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్‌తో పాటు రూ. 50 కోట్ల మార్క్‌ను టచ్ చేసేలా ఉందని, తన కెరీర్‌లో ఫస్ట్ 1 మిలియన్, 2 మిలియన్, 50 కోట్ల ఘనతలన్నీ ఈ టీమ్ వల్లే దక్కాయని సంతోషం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తరుణ్ తన లైఫ్ కి హీరో అని తెలిపాడు.

Updated Date - Nov 24 , 2026 | 09:37 PM