VISA Teaser: మహేష్ మామ డైలాగ్ తో మేనల్లుడు మడతెట్టేశాడుగా
ABN , Publish Date - Aug 14 , 2026 | 07:18 PM
యువ హీరో అశోక్ గల్లా, శ్రీ గౌరిప్రియ జంటగా ఉద్భవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం విసా - వింటారా సరదాగా.
యువ హీరో అశోక్ గల్లా (Ashok Galla), శ్రీ గౌరిప్రియ (Sri Gouri Priya) జంటగా ఉద్భవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం విసా (Visa) - వింటారా సరదాగా. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తోన్నాడు. ఇక ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. తేజర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
ఈ టీజర్‌లో అశోక్ గల్లా చెప్పే కామెడీ డైలాగులు, అమ్మాయిల గురించి ఇచ్చే ఫన్నీ ఎక్స్‌ప్లనేషన్స్ నవ్వులు పూయిస్తున్నాయి. 'ఈ భూమి మీద ఉన్న అబ్బాయిలందరినీ ఎలిమినేట్ చేయడానికి వచ్చిన ఏలియన్సే ఈ అమ్మాయిలు' అంటూ అశోక్ చెప్పే వాయిస్ ఓవర్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అశోక్ .. మొదట గౌరీ ప్రియను ప్రేమించడం.. ఆ తరువాత ఆమె రాహుల్ తో డేట్ కి వెళ్ళడం.. అశోక్ జీవితంలోకి శివాత్మిక రావడం.. ఇలా టీజర్ మొత్తం అమ్మాయిల వలలో పడి అబ్బాయిలు పడే తిప్పలను సరదాగా, వినోదాత్మకంగా చూపించారు. మరీ ముఖ్యంగా అశోక్ తన మేనమామ మహేష్ బాబు ఖలేజాలోని డైలాగ్ చెప్పడంతో బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశం కానీ దేశంలో ఒక యువకుడు ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.
హీరోయిన్ శ్రీ గౌరిప్రియతో అశోక్ గల్లా కెమిస్ట్రీ, విదేశీ నేపథ్యంలో సాగే విసా/సిటిజన్‌షిప్ ఆధారిత సరదా సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 'స్క్రీన్‌పై చూసేవాడికి కామెడీగా, అనుభవించేవాడికి కష్టంగా ఉండే కథ ఇది' అని టీజర్ ముగింపులో చెప్పే సంభాషణలు ఆద్యంతం అలరిస్తున్నాయి. మంచి కామెడీ, లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17 న థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమాతో అశోక్ గల్లా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.