విజయ్.. ఇక్కడ పెళ్లి.. అక్కడ విడాకులు
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:39 PM
విజయ్.. విజయ్.. విజయ్.. గత వారం రోజుల నుంచి ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ పేరు మారుమ్రోగిపోతోంది.
విజయ్.. విజయ్.. విజయ్.. గత వారం రోజుల నుంచి ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. పేరు ఒకటే అయినా వీరు ట్రెండ్ అవ్వడానికి కారణాలు మాత్రం రెండు. ఒకటేమో సంతోషం అయితే.. ఇంకొకటి బాధతో విజయ్ పేరు వినిపిస్తోంది. సంతోషం విషయానికొస్తే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తన ప్రేయసి రశ్మిక మందన్నా (Rashmika Mandanna)ను వివాహం చేసుకోవడం. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్స్ ని ఈ జంట నిజం చేశారు. ఫిబ్రవరి 26 న విజయ్ - రశ్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మహారాజుల కాలంలో ఎలా అయితే వివాహం చేసుకొనేవారో అదే విధంగా ఈ జంట వివాహం చేసుకున్నారు.
సాధారణంగా ఏ పెళ్ళిలో అయినా పెళ్ళికూతురు హైలైట్ అవుతుంటుంది. కానీ, విజయ్- రశ్మిక పెళ్ళిలో పెళ్ళికొడుకు హైలైట్ అయ్యారు. మహారాజు లుక్ లో విజయ్ ని చూసి అభిమానులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు ముగ్దులయ్యారు. అప్పట్లో రాజులు ఇలానే ఉండేవారేమో అని ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి విజయ్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పెళ్ళి తరువాత ఈ జంట హైదరాబాద్ కి రావడం, టెంపుల్స్ లో అన్నదానాలు, అభిమానులకు స్వీట్స్ పంచడం, విజయ్ తన భార్యతో కలిసి సొంతూరు వెళ్ళడం, సత్యనారాయణ వ్రతం.. ఇలా విజయ్ పేరు మారుమ్రోగుతూనే వస్తోంది. ఈ జంట రిసెప్షన్ మార్చి 4 న జరగబోతోంది. ఆ ఈవెంట్ కూడా అయితే తప్ప విజయ్ పేరు సోషల్ మీడియాలో ఆగదు. సినిమాల కన్నా ఎక్కువ ఈ విధంగానే విజయ్ గుర్తింపు తెచ్చుకున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ గుర్తింపు ఈ జంట నటిస్తోన్న రణబాలి విజయానికి సహాయపడుతుందేమో చూడాలి.
ఇక బాధ విషయానికొస్తే.. కోలీవుడ్ విజయ్ విడాకుల వివాదం. దళపతి విజయ్ (Thalapathy Vijay) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం విజయ్.. సినిమాలను వదిలి రాజకీయంగా ఎదగడానికి కష్టపడుతోన్నారు. ఆయన చివరగా నటించిన జననాయకుడు సినిమా కూడా చిక్కుల్లోనే ఉంది. ఇంకోపక్క ప్రత్యర్థుల కుట్రలతో విసిగి వేసారుతోన్న విజయ్ కి కుటుంబంలోనే పెద్ద సమస్య ఎదురైంది. 26 ఏళ్ళ వివాహ బంధాన్ని రద్దు చేయాలని విజయ్ భార్య సంగీత కోరడం చర్చనీయాంశమైంది. వేరొక నటితో విజయ్ కి వివాహేతర సంబంధం ఉందని, అందుకే విజయ్ నుంచి తనకు విడాకులు కావాలని సంగీత కోరారు. ఈ వార్త కోలీవుడ్ సినీ, రాజకీయ రంగంలో తుఫాన్ సృష్టించింది.
విజయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) అంటూ వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. గతంలో మాములుగా అనిపించిన ఈ జంట ఫోటోలు.. ఇప్పుడు ఆధారాలుగా మారాయి. త్రిష పెట్టిన పోస్టులు, ఫోటోలు అన్నింటిని నెటిజన్స్ తవ్వి తీస్తున్నారు. అలా ఈ విజయ్ పేరు నెట్టింట మారుమ్రోగుతోంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు.. ఎలా పడుతోంది అనేది తెలియాల్సి ఉంది.