Vijay Deverakonda: మన శంకర వరప్రసాద్ ఎఫెక్ట్‌.. రౌడీ హీరో సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 11 , 2026 | 05:09 PM

చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ యాప్స్ ఏవీ రివ్యూలను ఇవ్వకూడదని మేకర్స్ కోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ స్పందించాడు.

Vijay Devarakonda

తెలుగు సినిమా రంగం (Tollywood film industry) లో రివ్యూలకు సంబంధించిన చర్చ గత కొంతకాలంగా తీవ్రంగా జరుగుతోంది. ఎవరికి వారు ఫిల్మ్ జర్నలిస్టుల మాదిరిగా సోషల్ మీడియాలో రివ్యూలు పెట్టేస్తుండటంతో సినిమా కలెక్షన్స్ పై ఆ ప్రభావం పడుతోంది. ఈ విషయంలో మంచు విష్ణు (Manchu Vishnu) వంటి వారు గతంలో సుప్రీమ్ కోర్టు కెళ్ళారు. తమ సినిమాను ఉద్దేశించి ఎవరైనా పని కట్టుకుని విషప్రచారాన్ని, అవాస్తవాలను ప్రచారం చేస్తే కేసు పెట్టే అవకాశం ఇవ్వమని కోరారు. దాంతో కోర్టు విష్ణుకు అనుమతిని ఇచ్చింది. ఆ తర్వాత మరికొన్ని నిర్మాణ సంస్థలు సైతం ఈ విషయంలో సుప్రీమ్ కోర్ట్ తలుపు తట్టాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu) మూవీకి సంబంధించి ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ పోర్టల్స్ లో రేటింగ్ ఇవ్వకుండా కోర్టు ఆర్డర్ ను నిర్మాతలు తెచ్చుకున్నారు. ఈ విషయంపై క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్పందించాడు. సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ ఘన విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా రేటింగ్స్ ను నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందనే వార్తలను విజయ్ దేవరకొండ జత చేస్తూ, 'ఈ వార్త చూసిన తర్వాత ఎంతో ఆనందంగా ఉందని, అదే సమయంలో కొంత బాధ కూడా కలుగుతోంద'ని అన్నాడు.


సినిమా రంగానికి చెందిన ఎంతోమంది కృషి, కన్నకలలు, పెట్టిన పెట్టుబడికి ఇలాంటి నిర్ణయం వల్ల కొంత మేలు జరుగుతుందని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డాడు. అయితే అదే సమయంలో సినిమా రంగానికి చెందిన వారే ఇలాంటి సమస్యలను సృష్టిస్తున్నారని తెలిసి బాధపడుతున్నట్టు చెప్పాడు. 'లివ్ అండ్ లెట్ లివ్' అనే మాటకు, కలిసి ఉన్నత స్థితికి చేరుకోవాలనే దానికి అఅర్థం ఎక్కడ ఉందని విజయ్ దేవరకొండ ప్రశ్నించాడు. తాను నటించిన 'డియర్ కామ్రేడ్' రోజుల నుంచే వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఈ విష ప్రచారాన్ని గుర్తించానని, అప్పటి నుండి దీనిపై ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని విజయ్ దేవరకొండ వాపోయాడు. మంచి సినిమా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరనేది వాస్తవమే అయినా... తనతో సినిమాలను నిర్మించిన దర్శక నిర్మాతలు ఈ రకమైన వెన్నుపోటు కారణంగా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించారని అన్నారు.

'ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎలాంటి వారై ఉంటారు? ఇలాంటి వారి నుండి నా కలలను, నా తర్వాత ఈ రంగంలోకి వచ్చే వారి ఆశయాలను ఎలా కాపాడుకోవాలనే విషయమై ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఈ విషయం గురించి అందరూ ఆలోచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి సినిమాకు సైతం ముప్పు వాటిల్లుతుందని గ్రహించారు. అయితే... కోర్టు ద్వారా లభించింది కేవలం ఊరట మాత్రమే. దీని ద్వారా సమస్య పరిష్కారం కాదు. అయితే గుడ్డిలో మెల్ల' అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించాడు. ఇటీవల విజయ్ దేవరకొండ సినిమా 'కింగ్ డమ్' విడుదలైనప్పుడూ... ట్రోలింగ్ ను గురైంది.

Updated Date - Jan 11 , 2026 | 08:18 PM