భర్త కోసం రిస్క్ చేస్తున్న రష్మిక..

ABN , Publish Date - Aug 11 , 2026 | 03:56 PM

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాలలో రణబాలి ఒకటి. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా పెళ్లి తరువాత వారిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Ranabaali

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాలలో రణబాలి (Ranabaali) ఒకటి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక మందన్నా (Rashmika Mandanna) పెళ్లి తరువాత వారిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంతేకాకుండా విజయ్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా విజయ్ కి ఒక మంచి హిట్ లేదు. రణబాలి.. కచ్చితంగా హిట్ అందుకుంటుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్నీ బావుండి ఉంటే.. ఈ పాటికి విజయ్ - రష్మిక రణబాలి ప్రమోషన్స్ లో ఉండేవారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటంతో సినిమా విడుదలను వాయిదా వేసిన విషయం తెల్సిందే.


అన్నయ్య ఎలాగో రావడం లేదు కదా ఆ డేట్ ని నేను వాడుకుంటాను అని తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన సినిమా ఎపిక్ ని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రణబాలి కొత్త విడుదల తేదీ ఎప్పుడనే దానిపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, దానికి సమాధానం లభించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈసారి మాత్రం విజయ్ అస్సలు తగ్గేదెలే అంటున్నట్లు సమాచారం. ఇక రష్మిక కూడా భర్త కోసం రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇటీవల ఒక డ్యాన్స్ షూటింగ్‌లో రష్మిక తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆమెకు ఆరు వారాల విశ్రాంతిని సూచించినప్పటికీ, సినిమా ఆలస్యం కాకుండా ఉండేందుకు గాయంతోనే త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ అవ్వాలని చూస్తోందట. వద్దు అని విజయ చెప్పినా కూడా భర్తకి హిట్ ముఖ్యం అని ఆమె షూటింగ్ కి ఓకే చెప్పిందట. రణబాలిలో ఆమెకు సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మిగతా కొంచెం కూడా ఏదోలా పూర్తిచేయనుందని టాక్.


ఇక ఇంకోపక్క అక్టోబర్ 30 విడుదల తేదీ రణబాలికి ఎంతగానో కలిసిరానుంది. ఎందుకంటే అక్టోబర్ మొదటి రెండు, మూడు వారాల్లో వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకే 47, రజనీకాంత్ జైలర్ 2, ధనుష్ ఓం వంటి భారీ చిత్రాలు క్యూ కట్టాయి. దసరా బరిలో చిరంజీవి విశ్వంభర వస్తున్నట్లు టాక్ ఉంది. ఈ భారీ చిత్రాల పోటీ మధ్యలో రాకుండా.. చక్కగా అక్టోబర్ 30న సోలోగా రావడం రణబాలి కలెక్షన్లకు బాగా సేఫ్ కానుంది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

Updated Date - Aug 11 , 2026 | 03:56 PM