విరోష్ పెళ్లి ఫోటోలు.. సోషల్ మీడియా రచ్చరచ్చ! వామ్మో.. ఇంతమంది చూశారా
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:03 PM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత ఎనిమిదేళ్లుగా తమ రిలేషన్‌షిప్‌పై గోప్యత పాటిస్తూ వచ్చిన ఈ జంట, ఎట్టకేలకు ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత ఎనిమిదేళ్లుగా తమ రిలేషన్‌షిప్‌పై గోప్యత పాటిస్తూ వచ్చిన ఈ జంట, ఎట్టకేలకు ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారం, సాయంత్రం రష్మిక వారి కొడవ ఆచారాల ప్రకారం రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక కన్నుల పండువగా జరిగింది. అభిమానులు ముద్దుగా పిలుచుకునే 'విరోష్' పేరుతోనే తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశారు.
ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో సునామీ సృష్టించాయి. విజయ్ దేవరకొండ షేర్ చేసిన పోస్ట్‌కు కేవలం 12 గంటల్లోనే 12 మిలియన్ల లైక్స్ రాగా, రష్మిక పోస్ట్‌కు 14 మిలియన్ల లైక్స్ వచ్చాయి. వెరసి, కేవలం 12 గంటల వ్యవధిలోనే ఈ జంట ఫోటోలకు 2.6 కోట్ల లైక్స్ రావడం టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నిలిచింది. ఈ స్థాయి రెస్పాన్స్ రావడం వారిద్దరి క్రేజ్‌కు నిదర్శనమని చెప్పవచ్చు. వీరిద్దరి ప్రేమాయణం 'గీత గోవిందం' సినిమాతో మొదలైందని చాలా మందికి తెలిసిందే. అప్పటి నుంచి వెకేషన్లు, పండుగలు కలిసి జరుపుకుంటున్నప్పటికీ, ఎప్పుడూ కెమెరా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. సోషల్ మీడియాలో విడివిడిగా ఫోటోలు పెట్టినప్పటికీ, వాటి బ్యాక్‌గ్రౌండ్‌ను గమనించిన నెటిజన్లు వీరు కలిసే ఉన్నారని ఎప్పుడో కనిపెట్టేశారు. గతేడాది జరిగిన నిశ్చితార్థంతో వీరి పెళ్లి వార్తలు మరింత ఊపందుకున్నాయి.
నిజానికి ఈ జంట తమ బంధం గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. ఎనిమిదేళ్ల పాటు అభిమానుల్లో పెంచిన ఉత్కంఠే ఇప్పుడు ఈ రేంజ్ రికార్డులకు కారణమైంది. ఆ ఉత్కంఠకు తెర దించుతూ పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో, సినీ ప్రియులు ఎగబడి మరీ ఈ ఫోటోలను వీక్షిస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారి ట్రెండ్ అవుతున్నాయి. ఇక పెళ్లి వేడుక ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు రిసెప్షన్ పై పడింది. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.