హనీమూన్ నుండి రాగానే ముంబైకి...

ABN , Publish Date - Mar 23 , 2026 | 04:24 PM

విజయ్‌ దేవరకొండ త్వరలోనే 'రౌడీ జనార్దన్' షూటింగ్ లో పాల్గొనడానికి ముంబై వెళ్ళబోతున్నారు. ముంబై స్లమ్స్ నేపథ్యంలో ఈ సినిమాను రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నారు.

Vijay Deverakonda

ప్రముఖ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda)కు ముంబైతో చక్కని అనుబంధం ఉంది. అతని తొలి పాన్ ఇండియా మూవీ 'లైగర్‌' (Liger) షూటింగ్ అక్కడే జరిగింది. ఆ సమయంలో ముంబై వాసులు చూపించిన ఆదరణను విజయ్‌ దేవరకొండ అంత తేలికగా మర్చిపోలేరు. పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన 'లైగర్‌' బాక్సాఫీస్‌ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చినా... ముంబై షూటింగ్ విజయ్‌ దేవరకొండకు తీయని అనుభూతులనే అందించింది. తాజాగా మరోసారి విజయ్‌ దేవరకొండ 'రౌడీ జనార్దన్‌' షూటింగ్ కోసం ముంబై వెళుతున్నారు.


స్టార్ హీరోయిన్ రశ్మికను ప్రేమ వివాహం చేసుకున్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం హనీమూన్‌కు వెళ్ళినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన అభిమానులు 'అది థాయిలాండ్‌' అనే నిర్ధారణకు వచ్చారు. అక్కడ నుండి రాగానే విజయ్‌ దేవరకొండ 'రౌడీ జనార్దన్‌' షూటింగ్‌లోనే పాల్గొంటారని అంటున్నారు. ఆ షూటింగ్‌ ముంబైలో జరుగబోతోంది. ముంబైలోని స్లమ్ ఏరియాకు చెందిన కుర్రాడి కథగా దర్శకుడు రవికిరణ్‌ కోలా 'రౌడీ జనార్దన్‌'ను తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ (Keerthi Suresh) హీరోయిన్. విశేషం ఏమంటే... హీరో రాజశేఖర్ (Rajashekar) ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. శర్వానంద్ 'బైకర్' మూవీలో ఆయన హీరో తండ్రి పాత్రను పోషిస్తున్నారు. అలానే 'రౌడీ జనార్దన్'లోనూ రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఆయన లుక్ టెస్ట్ కూడా జరిగిందని చిత్ర బృందం చెబుతోంది. ఇదిలా ఉంటే... విజయ్‌ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న 'రణబాలి' మూవీ కూడా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది.

Updated Date - Mar 23 , 2026 | 04:25 PM