TG20.. అంబాసిడ‌ర్‌గా విజయ్ దేవరకొండ! నోటీసులు ఇస్తామ‌న్న‌ టీసీఏ కార్యదర్శి

ABN , Publish Date - Jun 17 , 2026 | 09:15 AM

శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 లీగ్‌కు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

Vijay Deverakonda

శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 లీగ్ (TG20 League) ప్రచారకర్తగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వ్యవహరించనున్నాడు. మంగళవారం నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన విలేకరుల‌ సమావేశంలో విజయన్‌ను ప్రచారకర్తగా నియమించినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) (Hyderabad Cricket Association) కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి ప్రకటించారు.

ఈ నెల 21 నుంచి ఉప్పల్ స్టేడియంలో వచ్చే నెల 19 వరకు జరిగే ఈ లీగ్‌ను యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీజీ20 లీగ్ కమిషనర్ ఆగంరావు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సంజీవ్ రెడ్డి, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ భరిణి పాల్గొన్నారు.

vijay deverakonda tg20 league

వెంకటేష్, విజయ్, తిలక్‌ల‌కు లీగల్ నోటీసులు ఇస్తాం

టీజీ20 లీగ్ పేరిట తెలంగాణ క్రికెట్ సమూహాన్ని, ప్రజలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Telangana Cricket Association) (హెచ్‌సీఏ) తప్పుదారి పట్టిస్తోందని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) కార్యదర్శి గురువారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన బహిరంగ ప్రకటనలో టీజీ20 పేరిట హెచ్‌సీఏ ఒక సర్కస్‌ను నిర్వహిస్తోందని ఆరోపించారు.

హెచ్‌సీఏ సంస్థాగత మోసానికి పాల్పడుతోందని, బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ లీగ్‌కు మద్దతు ఇస్తున్న హీరోలు వెంకటేశ్ (Venkatesh), విజయ్ దేవరకొండ, హెచ్‌సీఏ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అంబటి రాయుడు (Ambati Rayudu), క్రికెటర్లు తిలక్ వర్మ (Tilak Varma), సిరాజ్ (Mohammed Siraj)కు లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపారు.

vijay deverakonda tg20 league

Updated Date - Jun 17 , 2026 | 09:31 AM