Vijay Deverakonda: రాజమౌళితో చేస్తే తప్ప టికెట్ రేట్లు పెంచను
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:41 PM
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సినిమాలకు ఎప్పుడూ రికేట్ రేట్లు పెంచను అని అధికారికంగా హామీ ఇచ్చాడు.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సినిమాలకు ఎప్పుడూ రికేట్ రేట్లు పెంచను అని అధికారికంగా హామీ ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో టికెట్ హైక్స్ కోసం ప్రతిసారీ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ మధ్యనే టికెట్ రేట్లను పెంచకుండా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అదుకున్నాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటించిన రణబాలి సినిమాకి కూడా టికెట్ రేట్లను పెంచడం లేదని మేకర్స్ ప్రకటించారు.
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. విజయ్ సరసన రష్మిక నటించింది. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి టికెట్ రేట్ల పెంపుపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రూమర్లను చిత్ర యూనిట్ ఇప్పటికే కొట్టిపారేయగా, తాజాగా విజయ్ దేవరకొండ స్వయంగా స్పందించి ఓ డేరింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇకపై కేవలం రణబాలి సినిమాకే కాకుండా, తన భవిష్యత్తు సినిమాలకు కూడా టికెట్ ధరలు పెంచేది లేదని రౌడీ హీరో స్పష్టం చేశాడు. ఆడియన్స్‌పై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే ఈ నిర్ణయంలో ఒక ఆసక్తికరమైన మెలిక పెట్టాడు విజయ్. ఒకవేళ తాను భవిష్యత్తులో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో గనుక సినిమా చేస్తే, ఆ ఒక్క ప్రాజెక్ట్‌కి మాత్రమే టికెట్ ధరల పెంపు మినహాయింపు ఉంటుందని, అప్పటివరకు తన సినిమాలన్నింటికీ సాధారణ ధరలే ఉంటాయని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.