విజయ్ - రష్మిక: మూడు ముళ్ళు.. ఏడడుగులతో వివాహబంధంలోకి..
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:50 AM
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య విజయ్-రష్మిక ఏడడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మధ్య వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సాయంత్రం 4:30 గంటలకు కడువ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరగనుంది.
అయితే వివాహ వేదిక వద్ద అతిథులు ఎవరూ ఫోన్ ఉపయోగించకూడదనే నిబంధన ఉండడంతో వీరి పెళ్లి ఫోటోలు బయటకు రాలేదు. పెళ్లిలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని, డిజిటల్ పరధ్యానం లేకుండా కేవలం ఆత్మీయుల మధ్య ఈ వేడుక సాగాలని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇలాంటి వేడుకల్లో ఫోటోల కోసం చేసే హడావిడి కంటే, మనుషుల మధ్య ఉండే అనుబంధమే ముఖ్యమని విరోష్ జంట భావించింది. అందుకే, పెళ్లి మండపంలోకి ఫోన్‌లను అనుమతించలేదు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తీసే అద్భుతమైన చిత్రాలను మాత్రమే ఆ తర్వాత అభిమానులతో పంచుకోవాలని వారు ప్లాన్ చేశారు. రెండు రోజుల తర్వాత పెళ్లి ఫొటోలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వెరైటీగా సాగాయి. బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు సందడి చేశారు. అలాగే, సాధారణంగా పెళ్లిళ్లలో సంగీత్ ఉంటుంది, కానీ ఇక్కడ విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఒక సరదా క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.
పెళ్లిని ప్రైవేట్‌గా ఉంచినప్పటికీ, అభిమానుల కోసం ఒక భారీ విందును కూడా ప్లాన్ చేశారు. చాలా కాలంగా స్నేహితులుగా ఉంటూ, ఇప్పుడు జీవిత భాగస్వాములుగా మారిన విజయ్ - రష్మిక జోడీకి సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మార్చి 4న హైదరాబాద్ భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.