వీడియోలు వైరల్.. డైరెక్టర్ మానస శర్మ అలా అనేసిందేంటి
ABN , Publish Date - Apr 03 , 2026 | 07:00 AM
‘రాకాసా’ సినిమా షూటింగ్ కంటే ప్రచారానికే ఎక్కువ రోజులు కేటాయించాం. అందుకు తగ్గట్లే మంచి క్రేజ్ ఏర్పడింది’ అని నిర్మాత నిహారిక కొణిదెల అన్నారు.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిహారిక కొణిదెల, ఉమేశ్‌కుమార్ బన్సాల్ నిర్మించిన చిత్రం ‘రాకాసా’. సంగీత్ శోభన్ (Sangeeth Sobhan), నయన సారిక (Nayana Sarika) జంటగా మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల (Niharika konidela) మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ‘రాకాసా’ (Rakasa) లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. మొదటి సన్నివేశం నుంచి ముగింపు వరకూ కుటుంబమంతా కలసి చూసేలా ఈ మూవీ ఉంటుంది. ఇందులోని కామెడీ, హారర్ అంశాలు సరికొత్తగా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకురాలు మానస శర్మ (Manasa Sharma) ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈసినిమా అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కంటే ప్రచారానికే ఎక్కువ రోజులు కేటాయించాం. అందుకు తగ్గట్లే మంచి క్రేజ్ ఏర్పడింది’ అని అన్నారు.
డైరెక్టర్ మానస శర్మ మాట్లాడుతూ.. ‘రాకాసా’ నాకు చిత్రమైనా ఎక్కడా ఇబ్బంది పడకుండా నిహారికతో పాటూ టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. ఈ చిత్రం కలెక్షన్లతో పాటూ అభిమానుల హృదయాలనూ కొల్లగొడుతుంది. తప్పకుండా ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తిని ప్రేక్షకులకు ఇస్తుంది’ అని చెప్పారు. వారం రోజుల నుంచి ఎక్కడ చూసినా మీ వీడియోలే కనిపిస్తున్నాయి, హీరోయిన్‌గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు అని విలేకరులు అడగ్గా.. మన తెలుగు అబ్బాయిలు చాలా మంచి వారు ఓ అమ్మాయి సినిమా తీసిందని అలా వైరల్ చేస్తున్నారు అంతే అని తెలిపింది. నేను చాలా ఇంట్రోవర్ట్ అని తెర వెనకే ఉంటానని స్పష్టం చేసింది.
సంగీత్ శోభన్ మాట్లాడుతూ ‘రాకాసా’ గురించి రామ్‌చరణ్ గొప్పగా మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందీ చిత్రం. అందరికీ ఫుల్ వినోదాన్ని అందిస్తుంది’ అని అన్నారు. ‘ఇందులో నేను పోషించిన పాత్రకు మంచి ప్రసంశలు వస్తాయనే నమ్మకముంది’ అని నయన్ సారిక పేర్కొన్నారు. మరో నిర్మాత మన్యం రమేశ్ మాట్లాడుతూ ‘ఈ మధ్య కాలంలో సినిమాలు తీయడం కంటే ప్రజల్లోకి చేరువ చేయడమే అసలు సవాల్‌గా మారింది. ‘రాకాసా’ ప్రమోషన్స్ కోసం పెట్టిన శ్రమ విజయవంతం అయ్యి ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.