Veturi Sundara Ramamurthy: జనం మదిలో చెరిగిపోని ముద్ర వేసిన వేటూరి బాణి

ABN , Publish Date - Jan 29 , 2026 | 02:08 PM

భువనానికి వేణువై వచ్చి - గగనానికి పవనమై పయనించి - మధ్యలో మనందరికీ మధురాన్ని పంచిన సినీ వాగ్గేయకారులు వేటూరి సుందర రామమూర్తి... ఆయన 90వ జయంతి సందర్భంగా అభిమానులు వేటూరి కలం చేసిన అమృత మథనాన్ని మననం చేసుకున్నారు...

భువనానికి వేణువై వచ్చి - గగనానికి పవనమై పయనించి - మధ్యలో మనందరికీ మధురాన్ని పంచిన సినీ వాగ్గేయకారులు వేటూరి సుందర రామమూర్తి... ఆయన 90వ జయంతి సందర్భంగా అభిమానులు వేటూరి కలం చేసిన అమృత మథనాన్ని మననం చేసుకున్నారు...


స్ఫూర్తి గీతాల నిధి...
కళాత్మక చిత్రాలకు, కమర్షియల్ మూవీస్ కూ - తన కలంతో అమృతం పంచారు వేటూరి... సందర్భం ఏదైనా సరే క్షణాల్లో ఉచితరీతిన పదబంధాలను పలికించి పరమానందం మన సొంతం చేశారు వేటూరి... పండిత వంశంలో జనించడం వల్ల బాల్యం నుంచీ మాతృభాష తెలుగుపై పట్టు సాధించారు... పెదనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి శిష్యరికంలో ఏ పదం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రయోగించాలో నేర్చారు... పదనిసలకు తగ్గ పదాల విరుపుతో వేటూరి తనదైన బాణీ పలికించారు... భావితరాలకు సైతం స్ఫూర్తి కలిగించే గీతాలను అందించారు వేటూరి...


ఆ శృతమే... ఆయన శ్రుతి...

'గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అదే పునాది' అంటూ వేటూరి చిత్రసీమలో సాగారు... చదువుకొనే రోజుల్లోనే పలు భాషల్లో పాండిత్యం సంపాదించారు... ఎన్నెన్నో పదాలను, వాటి పుట్టుకను కాచివడపోశారు... వాటిని తరువాత సినిమా రంగంలో అనువుగా ప్రయోగిస్తూ సాగారు... ఆ శృతమే సాహిత్యాభిమానులకు వేటూరి శ్రుతిని పరిచయం చేసింది... ఆయనను  జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నిలిపింది... బెస్ట్ లిరిసిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకుని తెలుగు నుడికారంలోని ఠీవిని, తెలుగు భాషలోని తీయదనాన్నీ తనదైన రీతిలో సాహిత్యాభిమానులకు పరిచయం చేశారు వేటూరి...

ఓ అపురూపమైన కానుక..
.

వేటూరి కలం నుండి జాలువారిన వందలాది పాటలు సాహితీ ప్రియుల మదిలో ఈ నాటికీ చిందులు వేస్తూనే ఉన్నాయి... సంగీతాభిమానులకు వేటూరి పదబంధాలు శ్రవణానందం కలిగిస్తూ సాధనకు సంపదగా మారాయి... మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా తన దరికి చేరిన సందర్భానికి తగ్గరీతిలో వేటూరి కలం పరుగులు తీసింది... తెలుగువారికి పరమానందం పంచింది... ఆ పాటలతోనే తెలుగువారి మదిలో చెరిగిపోని తరిగిపోని స్థానం సంపాదించారు వేటూరి... ఆయన లేరని ఎవరన్నారు... వేటూరి ప్రతి పాటలోనూ ఆయన కనిపిస్తూనే ఉంటారు- వినిపిస్తూనే ఉంటారు... మరో వేటూరిని తెలుగు సినిమారంగం ఎన్నటికీ చూడలేదు... చూడబోదు... వేటూరి 90వ జయంతి సందర్భంగా ఆయన సాహితీసర్వస్వం వెలుగు చూస్తోంది... నిస్సందేహంగా అభిమానులకు 'వేటూరి సాహితీసర్వస్వం' ఓ అపురూప కానుక అనే చెప్పాలి...
 

Updated Date - Jan 29 , 2026 | 02:55 PM