ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

ABN , Publish Date - Nov 15 , 2026 | 07:50 AM

టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ సంగీత దర్శకుడు తుదిశ్వాస విడిచారు.

Vijay Sekhar

తెలుగు సినీ, సంగీత రంగాల్లో విషాదం చోటుచేసుకుంది. వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ పి. విజయ శేఖర్ (72) (P. Vijay Sekhar) కన్నుమూశారు. నెల్లూరు (Nellore) లో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మరణవార్తతో సంగీతాభిమానులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) తెరకెక్కించిన భారత్ బంద్ (Bharat Bandh) చిత్రానికి విజయ శేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమాతో ఆయన సినీ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు నాటక రంగంలోనూ ఆయనకు మంచి అనుబంధం ఉండేది. ముఖ్యంగా నాటకాలకు సంగీతం అందించడంతో పాటు భక్తి గీతాల ద్వారా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.

2010లో వ‌చ్చిన ఆకారం (Akaram) అనే సినిమాకు ఆయ‌న చివ‌ర‌గా సంగీతం అందించారు. సంగీతంపై మక్కువతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ శేఖర్ మరణం సంగీత రంగానికి తీరని లోటని ప‌లువురు సినీ, సంగీత రంగ ప్రముఖులు నివాళుల‌ర్పించి సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 08:01 AM