నిర్మాత.. దుర్గానాగేశ్వరరావు కన్నుమూత
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:46 PM
సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు పొట్లూరి దుర్గా నాగేశ్వరరావు కన్నుమూశారు. కళ్యాణ్ చక్రవర్తి, రమ్యకృష్ణతో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 'కృష్ణలీల' సినిమాను ఆయన నిర్మించారు.
విజయవాడ సమీపంలోని నిమ్మకూరుకు చెందిన సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు పొట్లూరి దుర్గా నాగేశ్వరరావు (76) మరణవార్త ఆలస్యంగా వెలుగుచూసింది. నటరత్న ఎన్టీఆర్ (NTR) తో 'చిక్కడు - దొరకడు', 'శ్రీరామాంజనేయ యుద్థం' చిత్రాలను నిర్మించిన పొట్లూరి వెంకట నారాయణ కుమారుడు దుర్గా నాగేశ్వరరావు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఈయన కూడా రవిరాజా పినిశెట్టి (Raviraja Pinisetty) దర్శకత్వంలో 'కృష్ణలీల' అనే సినిమాను నిర్మించారు. ఇందులో నందమూరి కళ్యాణ చక్రవర్తి, రమ్యకృష్ణ జంటగా నటించారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నారాయణ పిక్చర్స్ పేరుతోనే పలు చిత్రాలను ఆయన పంపిణీ చేశారు. యేడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గా నాగేశ్వరరావు ఫిబ్రవరి 10వ తేదీ తుదిశ్వాస విడిచారని ఆయన సోదరుడు పొట్లూరి సత్యనారాయణ (తమ్ముడు సత్యం) తెలిపారు. దుర్గా నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వివాహానంతరం వారు అమెరికాలో స్థిరపడ్డారు. దుర్గా నాగేశ్వరరావు మృతికి విజయవాడకు చెందిన పలువురు పంపిణీ దారులు సంతాపం తెలిపారు.