టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు మృతి
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:16 PM
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హీరోగా, విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా వందలాది చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు గిరిబాబు(83) (Giribabu)మృతి చెందారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హీరోగా, విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా వందలాది చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు గిరిబాబు(83) (Giribabu)మృతి చెందారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన శనివారం కన్నుమూశారు. ఆయన మరణవార్తతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.
వందలాది చిత్రాల్లో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు గిరిబాబు. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. గిరిబాబుకు చదువుకొనే రోజుల నుంచే నటనాభిలాష ఉండేది. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలు చూసి వారిలాగా అభినయిస్తూండేవారు. తరువాత నాటకాల్లో నటించారు. అదే ఆసక్తితో చిత్రసీమలోనూ ప్రవేశించారు. 1973లో రూపొందిన 'జగమే మాయ' చిత్రం ద్వారా నటునిగా పరిచయమయ్యారు గిరిబాబు. తరువాత 'వధూవరులు' వంటి కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. అయితే కథానాయకునిగా గిరిబాబు సక్సెస్ సాధించలేదు. దాంతో విలన్ వేషాల్లో రాణిస్తూ ముందుకు సాగారు. గిరిబాబు వందలాది చిత్రాల్లో నటించినా, ఆయనలోని అసలైన నటుణ్ణి తరువాతి తరం దర్శకులే పసికట్టారు. అలా కేరెక్టర్ యాక్టర్ గా మారి అనేక చిత్రాల్లో ఆకట్టుకున్నారు.
గిరిబాబు విలన్ వేషాలు వేసి జనాన్ని భయపెట్టినా, తరువాతి రోజుల్లో కేరెక్టర్ రోల్స్ లో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఓ తరం నటీనటులకు తండ్రి పాత్రల్లో గిరిబాబు భలేగా మెప్పించారు. ఇక గిరిబాబు కమెడియన్ గా, కామెడీ విలన్ గానూ అలరించారు. గిరిబాబు తనయుడు రఘుబాబు సైతం తండ్రి బాటలో పయనిస్తూ చిత్రసీమలో సాగుతున్నారు.
గిరిబాబు నటునిగానే కాదు జయభేరి పతాకంపై నిర్మాతగా, రచయితగా, దర్శకునిగానూ సాగారు. గిరిబాబు నిర్మించి, నటించిన 'దేవతలారా దీవించండి, సింహగర్జన, మెరుపుదాడి, రణరంగం' చిత్రాలు ఆదరణ పొందాయి. 'రణరంగం' చిత్రంతో దర్శకుడైన గిరిబాబు తరువాత 'నీ సుఖమే నే కోరుతున్నా' వంటి సినిమానూ రూపొందించారు. గిరిబాబు, మురళీమోహన్ మంచి మిత్రులు... ఇద్దరూ 'జగమేమాయ'తోనే చిత్రసీమకు పరిచయమయ్యారు. గిరిబాబు నెలకొల్పిన జయభేరి బ్యానర్ ను తరువాత మురళీమోహన్ తీసుకున్నారు. అప్పటి నుంచీ మురళీమోహన్ సొంత చిత్రాల్లో గిరిబాబు తప్పనిసరిగా కనిపించేవారు. సదరు చిత్రాల్లో మురళీమోహన్ నటించకున్నా, గిరిబాబు తప్పకుండా ఉండేవారు. చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు గిరిబాబు. ఇక సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.