గిరిబాబు మృతి.. ప్రముఖుల సంతాపం
ABN , Publish Date - Nov 14 , 2026 | 09:06 PM
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాల పాటు విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు గిరిబాబు (Giribabu) (82) మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాల పాటు విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు గిరిబాబు (Giribabu) (82) మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గిరిబాబు మరణవార్త తెలిసిన వెంటనే ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయామంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా గిరిబాబుకి సంతాపం తెలిపారు. 'ప్రముఖ నటులు గిరిబాబు గారు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడు గా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అంటూ పోస్ట్ చేశారు.
మోహన్ బాబు.. గిరిబాబు మృతివార్తను తట్టుకోలేకపోతున్నానని ఎమోషనల్ అయ్యారు. ' మద్రాస్‌లో ఉన్నప్పుడు గిరిబాబు, నేను రూమ్ మేట్స్. మేం అత్యంత సన్నిహితులం. ఇండస్ట్రీలో నాకంటే ముందు అతను నటుడయ్యారు. అలా మేం ఇద్దరం ఒకరి సినిమాల్లో మరొకరం నటిస్తూ వచ్చాం. గిరిబాబు గొప్ప మనసున్న వ్యక్తి. ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో విజయాలను సాధించారు. అలాంటి వ్యక్తి సినిమా పరిశ్రమలో లేరని తెలియడం బాధగా ఉంది. బాధతో నాకు మాటలు రావడం లేదు. గిరిబాబు ఆత్మకు శాంతి, అతని కుటుంబానికి మనశ్శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.
నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. 'సీనియర్ నటులు, దర్శక నిర్మాత గిరిబాబు మరణవార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. నా కెరీర్ ప్రారంభంలోనే 'అన్నదమ్ముల అనుబంధం'లో ఆయనతో కలిసి నటించాను. నా పలు చిత్రాలలో ఆయన ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. గిరిబాబు మంచి నటుడు మాత్రమే కాదు... మంచి వ్యక్తి కూడా. ఆయన లేని లోటు తీర్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గిరిబాబు తనయుడు రఘుబాబుకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను' అని తెలిపారు.
సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా గిరిబాబు మృతికి సంతాపం తెలిపారు. 'ప్రముఖ నటులు గిరిబాబు గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గిరిబాబు గారు విభిన్నమైన పాత్రలు పోషించారు. చక్కటి హాస్యం కూడా పండించారు. నిర్మాతగా, దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. గిరిబాబు కుమారుడు, నటుడు శ్రీ రఘుబాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్సంతాపం తెలిపారు. ఆయనతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గిరిబాబు మరణంపై విచారం వ్యక్తం చేశారు. 600కు పైగా చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా ప్రేక్షకులను మెప్పించిన గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుమారుడు రఘుబాబు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.