Venu Swamy: ఎన్టీఆర్ ని నేనే రాజకీయాల్లోకి రావద్దని చెప్పా..
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:15 PM
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వివాదాస్పద జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వివాదాస్పద జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలపై ఆయన చేసే వ్యాఖ్యలు, నిర్వహించే పూజలు తరచూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైరల్ అవుతుంటాయి. కొందరు ఆయన జోస్యాలను తీవ్రంగా విమర్శిస్తే, మరికొందరు ఆసక్తిగా గమనిస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయ భవిష్యత్తు, ఆయన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే దృష్టి సారించాడు. అయితే ఆయన మళ్లీ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడు? టీడీపీ బాధ్యతలు తీసుకుంటాడా లేదా? అనే అంశంపై నందమూరి అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఎల్లప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు సంబంధించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ.. 'జూనియర్ ఎన్టీఆర్ అసలైన పుట్టినరోజు వేరు, ఆయన బయట ప్రపంచానికి కనిపించేలా జరుపుకునే పుట్టినరోజు వేరు. ఆయన ఒరిజినల్ బర్త్‌డే డేట్ నా ఒక్కడికే తెలుసు. ఎన్టీఆర్ కచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడు, కానీ ఇప్పట్లో మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండదు. 2030 సంవత్సరం వరకు రాజకీయాల్లోకి రావద్దని నేనే స్వయంగా ఆయనకు చెప్పాను' అంటూ బాంబు పేల్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అసలు పుట్టినరోజు, 2030 పొలిటికల్ ఎంట్రీపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.