Venkatesh: వెంకీనా... మజాకా...

ABN , Publish Date - Jun 18 , 2026 | 01:55 PM

వెంకటేశ్‌ - అనిల్ రావిపూడి కాంబోలో కొత్త సినిమా షూటింగ్‌ మొదలైంది. వెంకటేశ్‌ నటిస్తున్న 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 2న రాబోతుండగా, వెంకీ - అనిల్‌ మూవీ జనవరి 12న రిలీజ్‌ అవుతోంది. అంటే వంద రోజుల వ్యవథిలో రెండు సినిమాలు వస్తాయన్నమాట!

Daggubati Venkatesh

విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) సైలెంట్‌గా హిట్‌ కొట్టేస్తుంటాడు. హడావుడీ ఆర్భాటం లేకుండా తన అభిమానులనే కాదు తెలుగు సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంటాడు. ఆ మధ్య వరకూ సరైన విజయాలు లేక కాస్తంత డీలా పడ్డాడు వెంకటేశ్‌. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన 'సైంథవ్‌' నిరాశ పర్చినా... ఆ తర్వాత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఘన విజయం సాధించి, ఆయన్ని తిరిగి సక్సెస్ ట్రాక్‌ ఎక్కించింది. అదే ఊపుతో ఈ యేడాది సంక్రాంతికి చిరంజీవి 'మన శంకర వరప్రసాద్‌ గారు'లో కీలక పాత్ర పోషించి, మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు వెంకటేశ్.

వెంకటేశ్‌ సోలో హీరోగా నటిస్తున్న 'ఆదర్శ కుటుంబం' మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతోందని మొదటే మేకర్స్ చెప్పారు. రిలీజ్‌ డేట్ ను అధికారికంగా ప్రకటించక పోయినా... ఇది అక్టోబర్ 2న జనం ముందుకు వస్తుందని సమాచారం. విశేషం ఏమంటే... సరిగ్గా దానికి వందరోజుల తర్వాత వెంకటేశ్‌ నటిస్తున్న మరో సినిమా 2027 జనవరి 12న విడుదల కాబోతోంది. అదే అనిల్‌ రావిపూడి దర్శకుడిగా గురువారం మొదలైన చిత్రం. వెంకటేశ్‌తో పాటు నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో కృతిశెట్టి, కీర్తి సురేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

సో... ఈ యేడాది సంక్రాంతి నుంచి వచ్చే యేడాది సంక్రాంతి వరకూ వెంకటేశ్‌ నటించిన మూడు సినిమాలు వస్తుంటే... అందులో రెండు సినిమాలు కేవలం వంద రోజుల గ్యాప్‌తో రావడం మరో విశేషం. మరి ఫుల్ ఫామ్‌లో ఉన్న వెంకటేశ్‌ ఈ రెండు సినిమాల ద్వారా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Updated Date - Jun 18 , 2026 | 01:58 PM