కోలీవుడ్ కి వెంకటేష్.. ఆ స్టార్ హీరో సినిమాలో ..
ABN , Publish Date - Aug 11 , 2026 | 03:13 PM
విక్టరీ వెంకటేష్ కేవలం హీరోగానే కాకుండా కథకు బలం ఇచ్చే కీలక పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఒకవైపు హీరోగా సూపర్‌హిట్ చిత్రాలు అందిస్తూనే, మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న ప్రత్యేక పాత్రలను చేయడానికి ఆయన వెనుకాడరు.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) కేవలం హీరోగానే కాకుండా కథకు బలం ఇచ్చే కీలక పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఒకవైపు హీరోగా సూపర్‌హిట్ చిత్రాలు అందిస్తూనే, మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న ప్రత్యేక పాత్రలను చేయడానికి ఆయన వెనుకాడరు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల, అలాగే రామ్ తో మసాలా.. వరుణ్ తేజ తో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి మల్టీస్టారర్లలో నటించి మెప్పించారు. ఇక బాలీవుడ్‌లోనూ సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో కీలక పాత్ర పోషించి అక్కడ కూడా అలరించారు.
ఇప్పటివరకు తెలుగు, హిందీ చిత్రాలకే పరిమితమైన వెంకీ మామ, ఇప్పుడు కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సినీ వర్గాల్లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న డేర్ డెవిల్ చిత్రంలో వెంకటేష్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ మధ్యనే మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వెంకీ మామ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా డేర్ డెవిల్ పై అంచనాలు పెరిగిపోయాయి.
ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించడానికి వెంకటేష్ అంగీకరించడం వెనుక ఫిలిం నగర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అజిత్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం, స్నేహం కారణంగానే వెంకీ ఈ ఆఫర్‌కు సుముఖత వ్యక్తం చేశారని ఒక టాక్ నడుస్తుంటే.. మరోవైపు ఈ సినిమాలో ఆయన కోసం డిజైన్ చేసిన పాత్ర ఎంతో బలంగా ఉండటమే అసలు కారణమని అంటున్నారు. కేవలం పేరుకే కాకుండా కథను కీలక మలుపు తిప్పే క్యారెక్టర్ కావడంతోనే ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. దీనికి తోడు కోలీవుడ్ మేకర్స్ వెంకీ ఇమేజ్‌కు తగినట్లు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, వెంకటేష్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తే మాత్రం అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ డేర్ డెవిల్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అజిత్ - వెంకటేష్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.