Venkaiah Naidu: మంచిగా దుస్తులు.. ధరించాలని చెప్పడం తప్పా?.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:23 AM
వేటూరి 90వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సాహితీ మహోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
'మంచిగా దుస్తులు కట్టుకో మని చెబితే కూడా వివాదాస్పదం అవుతోంది. దుస్తులు కట్టుకోవద్దు అంటే తప్పు కానీ మంచిగా దుస్తులు ధరించమని చెప్పడం కూడా తప్పు అవుతుందా? పైగా వాటి మీద వాద, ప్రతివాదనలు, వివాదాలు' అని మాజీ ఉపరాష్ట్రపతి (Former Vice President of India) ముప్పవరపు వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) అన్నారు.
వేటూరి 90వ జయంతి సందర్భంగా వేటూరి (Veturi Sundararama Murthy) సాహిత్యాభిమానుల సమితి (అమెరికా) నిర్వహణలో బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో కవికులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథి వెంకయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేటూరి సినీ, సినీయేతర సాహిత్యం 6 సంపుటాలను ఆవిష్కరించారు. ఆయనను పాటల తోటమాలిగా అభివర్ణించారు.పాత రోజుల్లో హీరో, హీరోయిన్ తాకకుండానే శృంగార సన్నివేశాలు పండించేవారన్నారు. ఇప్పటి సినిమాల్లో హీరో హీరోయినన్ను తాకినా, గోకినా సన్నివేశం పండడం లేదన్నారు.
జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగుకు ప్రాచీన హోదా సాధన ఉద్యమానికి ఆద్యుడు వేటూరి అన్నారు. భారత ప్రభుత్వ చీఫ్ సైంటి ఫిక్ సలహాదారు జి.సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. క్షిపణుల పరిశోధ నల సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు వేటూరి పాటలు విని ఉపశమనం పొందిన సందర్భాలెన్నో ఉన్నాయని చెప్పారు.
తోటకూర ప్రసాద్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేటూరి సుందర రామమ్మూర్తి భార్య సీతామహాలక్ష్మి, పెద్ద కుమారుడు రవి ప్రకాశ్, సినీ నటుడు తనికెళ్ల భరణి, గేయ రచయితలు జొన్న విత్తుల, చంద్రబోస్, సంగీత దర్శకులు మాదవ పెద్ది సురేశ్, మణిశర్మ, కోటి, రామజోగయ్య శాస్త్రి, దర్శకుడు వీఎన్ ఆదిత్య, గాయ కులు ఎస్పీ శైలజ, ఎస్పీ చరణ్ పాల్గొన్నారు.