'గని' చేదు అనుభవాన్ని మరువక ముందే...
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:05 PM
గతంలో స్పోర్ట్స్ డ్రామా 'గని'లో నటించి చేదు అనుభవాన్ని పొందాడు వరుణ్ తేజ్. దాని నుండి బయట పడకముందే ఇప్పుడు మరో స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళే సినిమాలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా నటించబోతున్నాడట.
'ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ (Varun Tej) పర్సనాలిటీకి అతను ఏ పాత్ర చేసినా బాగానే ఉంటుంది. అయితే అతనితో మంచి కామెడీ మూవీ కూడా తీయొచ్చని 'ఎఫ్ 2 (F2), ఎఫ్ 3 (F3)' చిత్రాలతో దర్శకుడు అనిల్ రావిపూడి నిరూపించాడు. ప్రేమకథా చిత్రాలకూ వరుణ్ తేజ్ సెట్ అవుతాడని 'ముకుంద (Mukunda), ఫిదా, తొలిప్రేమ' వంటి సినిమాలు నిరూపించాయి. అలానే 'కంచె, అంతరిక్షం, గద్దలకొండ గణేశ్' వంటి భిన్నమైన చిత్రాలనూ వరుణ్ తేజ్ చేశాడు. అయితే అతనికి ఉన్న గుడ్ ఫిజిక్‌కు స్పోర్ట్స్ డ్రామా చేస్తే బలే ఉంటుందని చాలా మంది అనుకున్నారు. బహుశా అదే ఆలోచన వరుణ్ తేజ్‌కూ వచ్చి ఉంటుంది. దాంతో 2022లోనే 'గని' (Gani) మూవీ నటించాడు వరుణ్ తేజ్. ఇందులో కిక్ బాక్సర్‌గా యాక్ట్ చేశాడు. ఈ సినిమా కోసం మేకోవర్ కూడా అయ్యాడు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన 'గని'లో ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ, సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. కానీ బ్యాడ్ లక్... 'గని' సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా పరాజయం వరుణ్ తేజ్‌నూ కృంగదీసింది.
అయితే స్పోర్ట్స్ డ్రామాలంటే ఇష్టం ఉన్న కారణంగా వరుణ్ తేజ్ ఇప్పుడు మరోసారి అదే జానర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం 'కొరియన్ కనకరాజు' సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. రితికా నాయక్ (Rithika Nayak) హీరోయిన్. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం కొరియాలో జరుగుతోంది. ఇదే సమయంలో వరుణ్ తేజ్ తన చెల్లెలు నిహారిక (Nihaarika) సొంత బ్యానర్‌లోనూ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఆ బ్యానర్‌లో 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాను డైరెక్ట్ చేసిన యదు వంశీ (Yadu Vamshi)... ఇప్పుడు తన రెండో సినిమా వరుణ్ తేజ్‌తో చేయ బోతున్నాడు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్‌గా నటించబోతున్నాడట! అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడతాయని అంటున్నారు. కొరియా నుండి వరుణ్ తేజ్ భారత్‌కు రాగానే... మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్ళేది కూడా తెలియచేస్తారట. మొత్తానికి 'గని' సినిమా చేదు అనుభవం నుండి బయట పడక ముందే... వరుణ్ తేజ్ ఈ సినిమాకు పచ్చ జెండా ఊపాడంటే... కథలో విషయం ఉండే ఉంటుందని సన్నిహితులు అంటారు.