తేజ్ కోసం తేజ్.. మెగా ప్రమోషన్స్ మాములుగా లేవుగా

ABN , Publish Date - Aug 03 , 2026 | 09:48 PM

ఈసారి వరుణ్ తేజ్ సినిమా విజయం కోసం మెగా ఫ్యామిలీ మొత్తం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొరియన్ కనకరాజు ప్రమోషన్స్‌లో ప్రత్యక్షమై అలరించాడు.

Korean Kanakaraju

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)కి గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడలేదు. దీంతో వరుణ్ కొద్దిగా గ్యాప్ తీసుకొని ట్రెండ్ ని తగ్గట్లు కామెడీ హర్రర్ కథతో ప్రేక్షకులను మెప్పించడానికి రెఢీ అయ్యాడు. వరుణ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన చిత్రం కొరియన్ కనకరాజు (Korean Kanakaraju). రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమాపై వరుణ్ తేజ్ కొండంత ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్లను కూడా చాలా యూనిక్‌గా, వెరైటీగా ప్లాన్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు వరుణ్ తేజ్.


ఈసారి వరుణ్ తేజ్ సినిమా విజయం కోసం మెగా ఫ్యామిలీ మొత్తం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొరియన్ కనకరాజు ప్రమోషన్స్‌లో ప్రత్యక్షమై అలరించాడు. ప్రమోషన్లలో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఒక ఫన్నీ వీడియో చేశాడు. ఇంట్లో తనకు దెయ్యాలు అంటే భయం లేదు అని..విరూపాక్ష సినిమాలో దెయ్యాన్నే ప్రేమించిన వాడిని అంటూ ఫోన్ లో మాట్లాడుతూ రావడం.. అక్కడ కొరియన్ దెయ్యం ఒక సీసాలో ఉండడంతో.. విరూపాక్ష.. విరూపాక్ష అని జపం చేస్తూ దాన్ని మూత తీయడం.. వెంటనే ఆ కొరియన్ దెయ్యం తేజ్ లోకి దూరి కొరియన్ కనకరాజుగా తేజ మారిపోతాడు. చివర్లో కొరియన్ కనకరాజు ఫీవర్ మొదలైంది అని చెప్పుకొచ్చారు.


ఇక సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ సరదా వీడియోను వరుణ్ తేజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. 'తేజ్.. నీకు కూడా కొరియన్ కనకరాజు ఫీవర్ పట్టుకున్నట్లుందిగా' అంటూ క్యాప్షన్ ఇచ్చి అభిమానులతో పంచుకున్నాడు. మెగా హీరోస్ ఇద్దరి మధ్య ఉన్న ఈ బాండింగ్, ఫన్నీ ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆగస్ట్ 7న రాబోతున్న ఈ కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్‌కి సాలిడ్ హిట్ అందిస్తుందో లేదో చూడాలి.

Updated Date - Aug 03 , 2026 | 09:48 PM