'వారణాసి' క్లైమాక్స్ అప్‌డేట్.. సెట్‌కే అన్ని కోట్ల ఖ‌ర్చా?

ABN , Publish Date - Jun 16 , 2026 | 02:40 PM

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది.

varanasi

జక్కన్న.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసి (Varanasi). మహేష్ బాబు (Mahesh Babu) సరికొత్త మేకోవర్‌తో, మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించిన ఈ కథలో, ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన విజువల్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్‌ను ఇవ్వనున్నాయి.

మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోకు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన రావడంతో, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్ర బృందం క్లైమాక్స్ షూటింగ్ కోసం భారీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సుమారు రూ. 4 కోట్లతో ఒక ప్రత్యేకమైన సెట్‌ను నిర్మించినట్లు టాక్. ఈ సెట్‌లో మహేష్ బాబుపై చిత్రీకరించబోయే క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు కనులవిందుగా, థ్రిల్లింగ్‌గా ఉండబోతున్నాయట. ఈ చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర', 'శ్రీరాముడు' అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుండటం గమనార్హం. అలాగే ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పవర్‌ఫుల్ పాత్రలో మెరవనుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

సుమారు రూ. 1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘వారణాసి’ చిత్రం నిర్మితమవుతోంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణతో కలిసి, రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో చిత్రీకరిస్తుండటం విశేషం. దీనివల్ల ప్రేక్షకులకు థియేటర్లలో ఒక అద్భుతమైన దృశ్యకావ్యం, సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ చిత్రానికి రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా పవర్‌ఫుల్ డైలాగ్స్ అందిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ కాంబినేషన్ చూస్తుంటేనే అర్థమవుతోంది.. రాజమౌళి వరల్డ్ బాక్సాఫీస్ మీద మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారని!. మరి రాజమౌళి-మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలంటే సినిమా విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.

Updated Date - Jun 16 , 2026 | 02:40 PM