Varanasi: జార్జియాలో.. జక్కన్న వేట! మహేష్ ఫ్యాన్స్‌కు.. పూనకాలే
ABN , Publish Date - Feb 04 , 2026 | 06:02 AM
వారణాసి ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చిన నాటి నుండే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కలయికలో రూపుదిద్దుకుంటున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి (Varanasi). ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చిన నాటి నుండే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గత ఏడాది విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లి, ప్రపంచవ్యాప్తంగా సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కె.ఎల్ నారాయణ, ఎస్.ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను అత్యంత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్న మొదటి భారతీయ చిత్రంగా ఇది రికార్డు సృష్టించబోతోంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రపంచస్థాయి నిపుణులు పనిచేస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన లుక్ చూస్తుంటే రాజమౌళి ఆయనను మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సాహసవీరుడిగా మహేష్ బాబు పలికించే హావభావాలు, ఫిజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండటం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. వీరిద్దరి చేరికతో ఈ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ లభించింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తదుపరి షెడ్యూల్‌ను జార్జియాలో నిర్వహించేందుకు జక్కన్న ప్లాన్ చేశారట. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయని, అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. జార్జియాతో పాటు అంటార్కిటికా వంటి అరుదైన ప్రదేశంలో కూడా షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గడ్డకట్టే మంచు కొండల మధ్య సాగే సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్సులను రాజమౌళి అక్కడ తీయనున్నారని సమాచారం.
ఇలాంటి వైవిధ్యమైన లొకేషన్ల ఎంపిక సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో సహాయపడతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి విజన్, మహేష్ బాబు నటన తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ మెగా ప్రాజెక్ట్ 2027 ఏప్రిల్ 7న ఉగాది పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారతీయ సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ చిత్రం ఉండబోతోందని జక్కన్న- మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. చూడాలి మరి, వారణాసి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రకంపనలు సృష్టించబోతోందో..