‘హే భగవాన్’.. సుహాస్ కెరీర్‌లో నిలిచిపోతుంది
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:45 AM
‘హే భగవాన్’ చిత్రం అతిపెద్ద కమర్షియల్ హిట్ అవుతుందని నిర్మాత వంశీ నందిపాటి అన్నారు.
‘హే భగవాన్’ (Hey Bhagawan) చిత్రం నవ్విస్తూనే హృదయాన్ని హత్తుకుంటుంది. సుహాస్ (Suhas) కెరీర్‌లో ఇది అతిపెద్ద కమర్షియల్ హిట్ అవుతుంది’ అని నిర్మాత వంశీ నందిపాటి అన్నారు. సుహాస్ కథానాయకుడిగా గోపీ అచ్చర తెరకెక్కించిన చిత్రమిది. నిర్మాత బన్నీవాస్‌తో కలసి వంశీ నందిపాటి (Vamsi Nandipati) సమర్పిస్తున్నారు.
ఈ నెల 20న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా వంశీ నందిపాటి మీడియాతో మాట్లాడారు. ‘ఇది పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. ఒక కొడుకు తన తండ్రిని అర్థం చేసుకునే క్రమంలో ‘బిజినెస్’ అనే ఎలిమెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. ట్రైలర్‌లో చూపించిన ఆ బిజినెస్ ఏంటనేది ఎవరూ ఊహించలేరు. అది థియేటర్లలో చూస్తేనే కిక్ వస్తుంది. సినిమాలో వినోదం ఎంత ఉంటుందో భావోద్వేగాలు అంతే బలంగా ఉంటాయి’ అని తెలిపారు.
సినిమా టైటిల్ సెన్సిటివ్‌గా ఉందని సెన్సార్ బోర్డ్ తొలుత అభ్యంతరం వ్యక్తం చేసినా, తర్వాత సమ్మతించింది. సుహాస్‌కు ఈ చిత్రంతో మంచి కమర్షియల్ సక్సెస్ దక్కుతుంది. ఆయన కెరీర్‌లో ఈ చిత్రం మైలురాయిగా నిలుస్తుంది. అలాగే ఈ చిత్ర నిర్మాతకు మంచి పేరు తెస్తుంది’ అని చెప్పారు.