Inka Em Anukoledhu: ఇద్దరు కొత్త దర్శకులతో వంశీ నందిపాటి సినిమా.. విడుదల తేదీ ఇదే!

ABN , Publish Date - Nov 11 , 2026 | 03:27 PM

వంశీ నందిపాటి, ఈటీవీ విన్ నిర్మిస్తున్న ‘ఇంకా ఏం అనుకోలేదు!’ డిసెంబర్ 11న విడుదల కానుంది.

vamshi nandipati

టైటిల్‌తోనే ఆసక్తి పెంచుతున్న చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు! (Inka Em Anukoledhu)’. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకులుగా పరిచయం అవుతున్నారు. అక్షయ్ లగుసాని, కేయూరి జంటగా నటిస్తుండగా.. జయకృష్ణ, రావు రమేష్, హర్షవర్ధన్, అనిత చౌదరి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాలోని ‘మేఘాలు సంద్రంలో’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ‘ఇంకా ఏం అనుకోలేదు!’ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పారు. దర్శకులు ప్రణయ్, గిరి చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని, భవిష్యత్తులో వారి పేర్లను పరిశ్రమ గుర్తుంచుకుంటుందని అన్నారు. సంగీత దర్శకుడు సింజిత్ అద్భుతమైన పాటలు అందించారని ప్రశంసించారు. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ భరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా తమకు ప్రత్యేకమని, ఒకేసారి ఇద్దరు దర్శకులను పరిచయం చేస్తున్నామని తెలిపారు. నిర్మాతగా వంశీ నందిపాటికి ఇదే తొలి సినిమా కావడం మరో విశేషమన్నారు. ఈటీవీ విన్ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ కూడా సింజిత్ సంగీతాన్ని అభినందించారు.


దర్శకులు ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని మాట్లాడుతూ.. తమ తొలి చిత్రానికి అవకాశం ఇచ్చిన వంశీ నందిపాటి, ఈటీవీ విన్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలోని పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో అక్షయ్ లగుసాని మాట్లాడుతూ.. సింజిత్ తనకు మంచి స్నేహితుడని, ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలు అందించారని చెప్పారు. హీరోయిన్ కేయూరి తనకు మంచి పాత్ర ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంగీత దర్శకుడు సింజిత్ మాట్లాడుతూ.. తొలిసారి ఇద్దరు దర్శకులతో కలిసి పనిచేశానని, రొమాంటిక్ కామెడీ జానర్ తనకు ఇష్టమని చెప్పారు. ఈ సినిమా మంచి అనుభూతిని ఇచ్చిందని, ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. ఇక నటుడు జయకృష్ణ, సహ నిర్మాత సమీర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రఘు, డైలాగ్ రైటర్ అనురాగ్, ఎడిటర్ నరేంద్ర, కెమెరామెన్ రెహాన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్లు సాయి కిషోర్, తన్మయ్ తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. రొమాంటిక్ కామెడీ కథాంశంతో రూపొందిన ‘ఇంకా ఏం అనుకోలేదు!’ డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనుంది.

Updated Date - Nov 11 , 2026 | 03:27 PM