పూరి జగన్నాథ్ చిత్రాలపై అనధికార నిషేధం !
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:11 PM
డైరెక్టర్స్ లో 'స్పీడున్నోడు' పూరి జగన్నాథ్ అనే పేరుంది. ఎలాంటి సబ్జెక్ట్ నైనా అనుకున్నదాని కంటే ముందుగానే పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు పూరి.
డైరెక్టర్స్ లో 'స్పీడున్నోడు' పూరి జగన్నాథ్ అనే పేరుంది. ఎలాంటి సబ్జెక్ట్ నైనా అనుకున్నదాని కంటే ముందుగానే పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు పూరి. అలాంటి పూరి సినిమాలపై ప్రస్తుతం అనఫిసియల్ బ్యాన్ ఉందట... ఎందుకో చూద్దాం...
'పోకిరి'పై ఆ దెబ్బ...
తన తరం దర్శకుల్లో అతి వేగంగా సినిమాలు తెరకెక్కించి అబ్బుర పరిచారు పూరి జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో 'స్లమ్ డాగ్- 33 టెంపుల్ రోడ్' అనే సినిమాను రూపొందిస్తున్నారు పూరి. 2019లో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' బంపర్ హిట్ గా నిలచింది. ఈ సినిమా తరువాత పూరి రూపొందించిన "లైగర్, డబుల్ ఇస్మార్ట్" రెండు చిత్రాలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఆ సినిమాల సమయంలో బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తీవ్ర నష్టాలకు గురయ్యారు. వారికి నష్టపరిహారం చెల్లించక పోతే రాబోయే పూరి 'స్లమ్ డాగ్' రిలీజ్ కు ఆటంకం కలిగించే వాతావరణం ఏర్పడింది. ఈ ప్రభావం పూరి జగన్నాథ్ పాత చిత్రాల 'రీ-రిలీజెస్'పైనా పడినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ 'పోకిరి' ఈ యేడాది మే లో రిలీజ్ చేయాలని భావించారు. ఆ చిత్రం రిలీజ్ కావాలంటే పూరి పాత బకాయిలు చెల్లించాలనే డిమాండ్ నెలకొని ఉంది. అందుకే 'పోకిరి' మే లో రిలీజ్ కావడం లేదని టాక్.
అదీ అసలు కారణం...
ఈ మధ్య రీ-రిలీజెస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మహేశ్ బాబు పాత చిత్రాలకు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది... దాంతో 'పోకిరి' చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. రైట్స్ పూరి దగ్గర ఉండటంతో అమెరికాకు చెందిన కొందరు 'ఫ్యాన్సీ రేట్' ఇచ్చి మరీ ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ 'పోకిరి'కి మంచి ఆఫర్సే వచ్చాయట. ఇదిలా ఉంటే 'లైగర్'తో నష్టపోయిన కొందరు పంపిణీదారులకు గతంలో పూరి జగన్నాథ్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావటంతో... బకాయిలు చెల్లించకుంటే 'పోకిరి' తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనీయమని తెగేసి చెప్పారట. దీంతో ముందు అనుకున్న డేట్ కు 'పోకిరి' స్థానంలో మహేశ్ బాబు 'అతిథి' రిలీజ్ కాబోతోంది. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' రెండు చిత్రాలు భారీ నష్టాలు తీసుకు వచ్చాయి. నష్ట పరిహారం అడిగిన బయ్యర్స్ కు పూరి జగన్నాథ్, ఆయన పార్ట్నర్ ఛార్మీ నుంచి సరైన హామీ లభించలేదట. దీంతో నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నవారు నైజాం పంపిణీదారుడైన సునీల్ నారంగ్ నాయకత్వంతో ఫిలిమ్ ఛాంబర్ ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సునీల్ నారంగ్ కు కూడా 'లైగర్' బకాయిలు రావలసి ఉంది... అందుకే అందరూ కలసి రాబోయే పూరి జగన్నాథ్ చిత్రాలపైన అనధికార నిషేధాన్ని విధించినట్టు ఫిలిమ్ నగర్ టాక్...
పూరి... ఏం చేస్తారో...
నిజానికి ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటే హాట్ కేక్ లా అమ్ముడయ్యేది. పూరి మ్యాజిక్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో రామ్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' బంపర్ హిట్టయింది... దాంతో మళ్ళీ పూరి సినిమాలపై క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో పూరి తెరకెక్కించిన 'లైగర్'పై డిస్ట్రిబ్యూటర్స్ ఎంతో నమ్మకం పెట్టుకుని రిలీజ్ చేశారు. భారీ నష్టాలను చవిచూశారు. తరువాత వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్'ది కూడా అదే దారి. ఈ రెండు సినిమాల దెబ్బ నుండి కోలుకోవాలనే విజయ్ సేతుపతితో 'స్లమ్ డాగ్' రూపొందిస్తున్నారు పూరి... ఆయన పాత చిత్రాల రీ-రిలీజ్ కే అడ్డంకులు ఎదురవుతూ ఉంటే, తాజా చిత్రం 'స్లమ్ డాగ్'కు ఎలాంటి చిక్కులు వస్తాయో అంటున్నారు పరిశీలకులు... ఈ పరిస్థితి నుండి పూరి గట్టెక్కటానికి పూరి ఏం చేస్తారు? తనపై ఉన్న అనధికార నిషేధాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి!